బండ్ల గణేశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. జూబ్లీహిల్స్ కుటుంబ ఆస్తి వేలం చెల్లుబాటేనని తీర్పు
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ కుటుంబానికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రుణాల రికవరీ ప్రక్రియలో భాగంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న కుటుంబ ఆస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని హైకోర్టు సమర్థించింది. గతంలో ఈ వేలాన్ని రద్దు చేస్తూ డెబ్ట్ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్టీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.
జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. శ్రీపరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్న రుణాల చెల్లింపులో డిఫాల్ట్ కావడంతో, గ్యారంటర్లుగా ఉన్న బండ్ల గణేశ్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన జూబ్లీహిల్స్ ఆస్తిని యూనియన్ బ్యాంక్ సర్ఫేసీ చట్టం కింద స్వాధీనం చేసుకుంది. అనంతరం 2022లో నిర్వహించిన బహిరంగ వేలంలో ఈ ఆస్తి రూ.8.51 కోట్లకు విక్రయించబడింది.
ఈ వేలాన్ని డీఆర్టీ గతంలో రద్దు చేస్తూ ఆస్తిని తిరిగి ఇవ్వాలని ఆదేశించగా, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా బ్యాంకు తరఫు న్యాయవాదులు వివాదాస్పద ఆస్తి కంపెనీ ఆస్తి కాదని, వ్యక్తిగత హామీదారుల ఆస్తి కావడంతో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) మొరటోరియం దీనికి వర్తించదని వాదించారు.
ఇరుపక్షాల వాదనలు, చట్టపరమైన అంశాలను పరిశీలించిన హైకోర్టు బ్యాంకు చర్యలు సర్ఫేసీ చట్టానికి అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేసింది. దీంతో డీఆర్టీ ఉత్తర్వులను రద్దు చేస్తూ, యూనియన్ బ్యాంక్ నిర్వహించిన ఆస్తి వేలం చట్టబద్ధమేనని తుది తీర్పు వెలువరించింది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)