బుల్లెట్ ట్రైన్ భూసేకరణపై కలకలం.. రైతుల్లో ఆందోళన

Aug 01, 2026 - 14:20
0 3
బుల్లెట్ ట్రైన్ భూసేకరణపై కలకలం.. రైతుల్లో ఆందోళన

హైదరాబాద్–పుణె బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో భూసేకరణ జరుగుతుందనే ప్రచారం స్థానిక రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. గూగుల్ ఎర్త్ మ్యాప్‌లలో కనిపిస్తున్న అలైన్‌మెంట్ ఆధారంగా బహదూర్‌గూడ, సయ్యద్‌గూడ, పెద్దగోల్కొండ, నందిపల్లి, రషీద్‌గూడ, మంఖాల్ గ్రామాల పరిధిలో సుమారు 2 వేల ఎకరాల భూమిని సేకరిస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో రైతులు తమ భూములు కోల్పోతామేమోనన్న ఆందోళనతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

గతంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం ఇప్పటికే పెద్ద మొత్తంలో భూములు కోల్పోయామని, ఇప్పుడు మరోసారి భూసేకరణ జరిగితే వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల సర్వే గుర్తులు కనిపిస్తున్నాయని, అందుకే అనుమానాలు మరింత పెరిగాయని స్థానికులు చెబుతున్నారు.

అయితే ఈ ప్రచారంపై అధికారులు స్పష్టత ఇచ్చారు. బుల్లెట్ ట్రైన్ భూసేకరణకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఆదేశాలు లేదా నోటిఫికేషన్ రాలేదని రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీధర్ తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మ్యాప్‌లు ప్రాథమిక అధ్యయనంలో భాగంగా రూపొందించి ఉండే అవకాశముందని, తుది అలైన్‌మెంట్ నిర్ణయానికి ముందు క్షేత్రస్థాయిలో పలు సర్వేలు నిర్వహిస్తారని చెప్పారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని రైతులకు సూచించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User