మత్తు కోసం యువత కొత్త దారులు.. నిషేధిత ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లతో అక్రమ దందా బట్టబయలు
గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో యువత మత్తు కోసం కొత్త మార్గాలను ఆశ్రయిస్తోంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొన్ని ముఠాలు నొప్పి నివారణ, మానసిక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే నిషేధిత ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్నాయి. వీటిని అధిక మోతాదులో వినియోగిస్తూ యువత మత్తుకు బానిసవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ తరహా ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. పట్టణాలతో పాటు మారుమూల గ్రామాలు, గూడాలు, తండాలకు కూడా ఈ మత్తు దందా విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల టర్మిన్ మత్తు ఇంజెక్షన్ల ముఠా పట్టుబడిన అనంతరం, తాజాగా ఉట్నూరులో మరో నిషేధిత మందుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉట్నూరు ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే తెలిపిన వివరాల ప్రకారం, ఈద్గా సమీపంలో తనిఖీల సందర్భంగా కొందరు నిషేధిత నొప్పి నివారణ మాత్రలను పొడి చేసి నీటిలో కలిపి సిరంజీల ద్వారా శరీరంలోకి ఎక్కించుకుంటుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ మందులను విక్రయిస్తున్న ఫార్మసిస్ట్ కదం శేఖర్‌తో పాటు చౌహాన్ నిఖిల్ రాజ్, పొడేటి వంశీకృష్ణలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి నిషేధిత ట్యాబ్లెట్లు, సిరంజీలు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు కెమికల్ డ్రగ్స్ అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న మరో ముఠాను ఛేదించి, ఏడుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 190 ఇన్సులిన్ సిరంజీలు, 50 టర్మిన్ బాటిల్స్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు.
షెడ్యూల్ హెచ్-1 ఔషధాలు, అనస్థీషియా ఇంజెక్షన్లను మత్తు కోసం అక్రమంగా విక్రయిస్తున్న నెట్‌వర్క్‌పై పోలీసులు దృష్టి సారించారు. త్వరలోనే మరికొన్ని ముఠాల గుట్టు రట్టు అయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)