భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఉత్తరాంధ్రకు 'లాంచ్‌ప్యాడ్'గా అభివర్ణన
జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు రావడం తన అదృష్టమని పేర్కొన్న ప్రధాని, ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వేగా, ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకు లాంచ్‌ప్యాడ్‌గా నిలుస్తుందని అన్నారు.
తెలుగులో "అందరికీ నమస్కారం" అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ, పవిత్రమైన ఉత్తరాంధ్ర నేలపై అల్లూరి సీతారామరాజు పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించడం గర్వకారణమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిస్తున్న దూరదృష్టిని ప్రశంసిస్తూ, ఈ విమానాశ్రయం పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను మరింత విస్తరింపజేస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సుమారు రూ.18 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రహదారి, విమాన అనుసంధానం బలోపేతమై రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని చెప్పారు.
ఎయిర్‌పోర్టుల నామకరణంపై కూడా మోదీ ప్రస్తావించారు. గతంలో కొద్ది మంది నాయకుల పేర్లకే ఎయిర్‌పోర్టులు పరిమితమయ్యాయని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయోధ్యలో మహర్షి వాల్మీకి, పంజాబ్‌లో సంత్ రవిదాస్, ఇప్పుడు భోగాపురంలో అల్లూరి సీతారామరాజు పేరుతో విమానాశ్రయాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అల్లూరి సేవలను చిరస్థాయిగా గుర్తుంచుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
దేశంలో విమానయాన రంగం విస్తృతంగా అభివృద్ధి చెందిందని మోదీ తెలిపారు. 2014కు ముందు దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 166కు చేరిందన్నారు. ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలకు కూడా విమాన సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.
ప్రారంభోత్సవ వేడుకల్లో 13 వేల మంది గిరిజన విద్యార్థులు సంప్రదాయ థింసా నృత్యంతో ప్రధానిని ఆహ్వానించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఈ ప్రదర్శనను ప్రత్యేక వాహనంలో తిరుగుతూ మోదీ తిలకించారు. ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే డప్పు, తప్పెట నృత్యాలు కూడా సభలో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ఇతర ప్రజాప్రతినిధులు, జీఎంఆర్ గ్రూపు ప్రతినిధులు పాల్గొన్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)