14 గంటల్లోనే ఆంజనేయస్వామి విగ్రహం స్వాధీనం.. శాస్త్రోక్తంగా తిరిగి ప్రతిష్ఠించిన టీటీడీ
తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడో మైలు వద్ద ఉన్న ప్రసన్నాంజనేయస్వామి ఆలయం సమీపంలో చోరీకి గురైన ఆంజనేయస్వామి విగ్రహాన్ని టీటీడీ అధికారులు అత్యంత వేగంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ విభాగం, జిల్లా పోలీసుల సమన్వయంతో కేవలం 14 గంటల్లోనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో పాటు విగ్రహాన్ని భద్రంగా తిరిగి తీసుకొచ్చారు.
విగ్రహం లభ్యమైన అనంతరం టీటీడీ ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం పుణ్యాహవచనం, జలసంప్రోక్షణం వంటి శుద్ధి క్రతువులు నిర్వహించారు. అనంతరం గురువారం ఉదయం శుభముహూర్తంలో స్వామివారి విగ్రహాన్ని తిరిగి అదే స్థానంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. ఆధునిక సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థ, విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తత, జిల్లా పోలీసుల సమన్వయంతో ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించగలిగామని తెలిపారు. టీటీడీ వద్ద ఉన్న సాంకేతిక నిఘా వ్యవస్థ ఇలాంటి ఘటనలను వెంటనే గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు.
ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తిరుమల ఘాట్‌రోడ్డులోని చిన్న దేవాలయాలు, భక్తులు ప్రతిష్ఠించిన దేవతా విగ్రహాలకు రక్షణగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో పాటు మరింత ఆధునిక సీసీ కెమెరాలను అమర్చనున్నట్లు వెల్లడించారు.
తిరుమలలో దశాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అనేక దేవతా విగ్రహాలు ఉన్నాయని, వాటి పవిత్రతను ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులకు లేదా టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, విజిలెన్స్ అధికారులు, ఇతర టీటీడీ అధికారులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)