తెలంగాణలో తొలి రోప్‌వే.. భువనగిరి కోటకు కొత్త హంగులు!
తెలంగాణ పర్యాటక రంగంలో మరో కీలక మైలురాయికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో తొలిసారిగా రోప్‌వే టూరిజం అందుబాటులోకి రానుంది. చరిత్ర, సాహసం, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన భువనగిరి కోటపై రోప్‌వే ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
వెయ్యేళ్ల చరిత్ర కలిగిన భువనగిరి ఖిల్లాను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించేందుకు రోప్‌వే ఏర్పాటుపై టూరిజం శాఖ వేగంగా కసరత్తు చేస్తోంది.
భువనగిరి కోట సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో, సముద్ర మట్టానికి సుమారు 610 మీటర్ల (దాదాపు 3000 అడుగుల) ఎత్తులో ఉన్న ఏకశిలా పర్వతంపై ఉంది. 10–11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు ఈ కోట నిర్మాణానికి పునాది వేశారని చరిత్ర చెబుతోంది.
కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0’ కింద భువనగిరి కోటను ఎంపిక చేసి, “భువనగిరి ఫోర్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్” అభివృద్ధికి రూ.56.81 కోట్ల నిధులను మంజూరు చేసింది. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి నుంచి కోట సమీపం వరకు దాదాపు ఒక కిలోమీటరు పొడవున రోప్‌వే నిర్మించనున్నారు.
రోప్‌వే అందుబాటులోకి వస్తే ఇది తెలంగాణలోనే తొలి రోప్‌వేగా గుర్తింపు పొందనుంది. ప్రస్తుతం కోటపైకి చేరడానికి సుమారు గంట సమయం పడుతుండగా, రోప్‌వే ద్వారా పర్యాటకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందనుంది.

ప్రాజెక్టు కోసం దాదాపు ఐదు ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించగా, నిర్వాసితులకు సుమారు రూ.4 కోట్ల పరిహారం చెల్లించారు. ఇప్పటికే బేస్ క్యాంప్, రోప్‌వే పిల్లర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కోటకు వెళ్లే మార్గాలను మెరుగుపరుస్తూ, అవసరమైన చోట కొత్త మెట్లను కూడా నిర్మిస్తున్నారు.
అలాగే కోటపై బేస్ క్యాంప్ వద్ద రెస్టారెంట్లు, గ్రీనరీ, విశ్రాంతి సౌకర్యాలు, పార్కింగ్ వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నారు. సుమారు రూ.30 కోట్ల వ్యయంతో డెస్టినేషన్ వెడ్డింగ్ జోన్, స్విమ్మింగ్ పూల్ వంటి ఆకర్షణీయ నిర్మాణాలను కూడా ప్రతిపాదించారు.
రోప్‌వే పూర్తయితే గంటకు సుమారు 300 మంది పర్యాటకులు భువనగిరి కోటను సందర్శించే అవకాశం ఉంటుంది. ఇది సెకనుకు సుమారు 6 మీటర్ల వేగంతో ప్రయాణించనుంది.
ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం యాదగిరిగుట్ట, భువనగిరి కోట, కొలనుపాకలను కలుపుతూ ఒక సమగ్ర ఆధ్యాత్మిక–వారసత్వ టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తోంది. యాదాద్రి, నాగార్జునసాగర్ బుద్ధవనం, అనంతగిరి కొండలు వంటి ప్రాంతాలను కూడా ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ పర్యాటక రంగం దేశంలోనే కీలక గమ్యస్థానంగా మారే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)