బాధితులతో అమర్యాదగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్

Jun 25, 2026 - 12:43
0 3
బాధితులతో అమర్యాదగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు..  సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్

పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల అమర్యాదగా, నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజలు కష్టాల్లో ఉండి పోలీస్ స్టేషన్‌కు వస్తారని, అలాంటి సమయంలో వారిని మరింత ఇబ్బందులకు గురిచేసే విధంగా ప్రవర్తించడం సహించబోమని స్పష్టం చేశారు.

బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో సీపీ సజ్జనార్ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుదారులతో వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ప్రజలకు గౌరవప్రదమైన సేవలు అందించడం ప్రతి పోలీసు ఉద్యోగి బాధ్యత అని పేర్కొన్నారు.

కొన్ని పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్టులుగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు, అడ్మిన్ ఎస్సైలు ఫిర్యాదుదారులతో అనుచితంగా మాట్లాడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజలకు సహాయం చేయాల్సిన చోట వారిని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం, ఫిర్యాదులు స్వీకరించకుండా వాయిదాలు వేయడం వంటి చర్యలు తీవ్రంగా పరిగణించబడతాయని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో రహస్యంగా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించినట్లు సీపీ వెల్లడించారు. పోలీసు అధికారులనే సాధారణ పౌరుల వేషంలో వివిధ స్టేషన్లకు పంపించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో కొన్ని స్టేషన్లలో సిబ్బంది బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించకపోవడం, ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయడం, ఇతర స్టేషన్లకు పంపించడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.

డెకాయ్ ఆపరేషన్లలో బయటపడిన లోపాల ఆధారంగా బాధ్యులైన రిసెప్షనిస్టులు, అడ్మిన్ ఎస్సైలు, ఇతర సిబ్బందిపై చర్యలు ప్రారంభించినట్లు సీపీ తెలిపారు. పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన కొందరు ఇన్‌స్పెక్టర్లకు కూడా ఛార్జిమెమోలు జారీ చేసినట్లు సమాచారం.

"మీ కుటుంబ సభ్యులు ఏదైనా సమస్యతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి" అంటూ సిబ్బందికి సజ్జనార్ సూచించారు. ప్రజల పట్ల సానుభూతితో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఇకపై ఫిర్యాదులను స్వీకరించడంలో ఆలస్యం చేయడం, ప్రజలను అవసరం లేకుండా తిప్పలు పెట్టడం, అమర్యాదగా మాట్లాడడం వంటి ఘటనలు పునరావృతమైతే సస్పెన్షన్లు, బదిలీలు సహా కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User