చంచల్‌గూడ జైల్లో ‘ఫీల్ ది జైల్’టూరిజం..
తెలంగాణ పర్యాటక శాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని చారిత్రాత్మక చంచల్‌గూడ కేంద్ర కారాగారాన్ని అధికారిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ ‘ఫీల్ ది జైల్’ అనే ప్రత్యేక టూరిజం కాన్సెప్ట్‌ను ప్రారంభిస్తోంది. చార్మినార్, గోల్కొండ కోట వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాల సరసన ఇప్పుడు జైలు అనుభూతి కూడా చేరడం విశేషంగా మారింది.
జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ప్రతిపాదనల మేరకు ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే ప్రారంభించిన ‘ఫీల్ ది జైల్’ అనుభూతిని మరింత విస్తృతంగా పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.

ఈ ప్రత్యేక టూరిజం ప్యాకేజీలో భాగంగా 12 గంటలు, 24 గంటల అనుభూతి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా పర్యాటకుల సౌలభ్యం కోసం 4 గంటలు, 8 గంటల షార్ట్ టర్మ్ ప్యాకేజీలను కూడా ప్రవేశపెట్టే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ఒకరోజు పాటు జైలు అనుభూతి పొందాలనుకునే సందర్శకుల కోసం రూ.2,000 టికెట్ ధర నిర్ణయించారు. త్వరలోనే ఆన్‌లైన్ టికెటింగ్ ద్వారా బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనే పర్యాటకులు జైలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వారికి జైలు యూనిఫారాలు అందించి, నిజమైన ఖైదీ జీవన విధానాన్ని అనుభవించేలా ఏర్పాట్లు చేస్తారు. ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం కూడా జైలు విధానంలోనే అందించబడుతుంది.
నిజాం కాలంలో 1912లో నిర్మించిన చంచల్‌గూడ జైలు చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిర్మాణం. ఆ నిర్మాణ శైలిని కాపాడుతూ, అసలైన జైలు వాతావరణాన్ని పర్యాటకులకు అనుభూతి కలిగించేలా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు.
పర్యాటక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, భవిష్యత్తులో విద్యార్థులకు కూడా జైలు వ్యవస్థ, చట్టాలపై అవగాహన కల్పించే విద్యా పర్యటనల కోసం ఈ కేంద్రాన్ని వినియోగించనున్నారు.ఈ కొత్త టూరిజం కాన్సెప్ట్ హైదరాబాద్ పర్యాటక రంగంలో ఒక వినూత్న ఆకర్షణగా మారనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)