భారత్‌లోనే తొలిసారి బీబీఎల్ మ్యాచ్.. చెన్నైలో బిగ్‌బాష్ లీగ్ తొలి మ్యాచ్
క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన ఘట్టానికి భారత్ వేదిక కానుంది. విదేశీ ఫ్రాంచైజీ లీగ్ అయిన బిగ్ బాష్ లీగ్ (BBL) తొలి మ్యాచ్‌ను తొలిసారిగా భారత గడ్డపై నిర్వహించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. 2026-27 సీజన్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసిన ఆస్ట్రేలియా బోర్డు.. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ను చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
డిసెంబర్ 12న మెల్‌బోర్న్ రెనిగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ జట్ల మధ్య ఈ చారిత్రక మ్యాచ్ జరగనుంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించిన క్రీడా సహకార నిర్ణయాల నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు చెన్నైని వేదికగా ఎంపిక చేశారు.
భారత్‌లో ప్రారంభ మ్యాచ్ అనంతరం ప్రధాన బీబీఎల్ సీజన్ డిసెంబర్ 15 నుంచి ఆస్ట్రేలియాలో కొనసాగనుంది. తొలి మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ జట్లు గబ్బా వేదికగా తలపడనున్నాయి. ఈ సీజన్‌లో లీగ్ దశలో 40 మ్యాచ్‌లు, అనంతరం నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జనవరి 26న ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది.
నాలుగేళ్ల విరామం తర్వాత డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ రోజున కూడా బీబీఎల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. మెల్‌బోర్న్ రెనిగేడ్స్, హోబార్ట్ హరికేన్స్ జట్లు జంక్షన్ ఓవల్‌లో తలపడనున్నాయి. కొత్త ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు తర్వాత ఆ మైదానంలో జరిగే తొలి బీబీఎల్ మ్యాచ్ ఇదే.
ఈ సీజన్‌లో మరో కీలక మార్పుగా ఐపీఎల్ తరహాలో 'డిజిగ్నేటెడ్ బ్యాటర్ అండ్ ఫీల్డర్' అనే కొత్త నిబంధనను అమలు చేయనున్నారు. ఈ నిబంధన ప్రకారం ఒక ఆటగాడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయగా, మరో ఆటగాడు కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయగలడు. అయితే ఫీల్డింగ్ కోసం వచ్చిన ఆటగాడికి బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసే అవకాశం ఉండదు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)