సెమీస్‌లో సెంటిమెంట్ అస్త్రం.. ఇంగ్లండ్‌పై నేవీ బ్లూ జెర్సీతో బరిలోకి అర్జెంటీనా

Jul 14, 2026 - 13:36
0 3
సెమీస్‌లో సెంటిమెంట్ అస్త్రం.. ఇంగ్లండ్‌పై నేవీ బ్లూ జెర్సీతో బరిలోకి అర్జెంటీనా

ఫిఫా ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా కీలక నిర్ణయం తీసుకుంది. జులై 16న అట్లాంటా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే ప్రతిష్ఠాత్మక పోరులో సంప్రదాయ నీలం-తెలుపు జెర్సీకి బదులుగా నేవీ బ్లూ ఆల్టర్నేట్ జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇందుకు సంబంధించిన అనుమతిని ఫిఫా నుంచి కూడా పొందినట్లు సమాచారం.

ఈ నిర్ణయం వెనుక అర్జెంటీనా జట్టుకు ఉన్న చారిత్రక సెంటిమెంట్ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 1986 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో డియాగో మారడోనా ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’తో పాటు ‘గోల్ ఆఫ్ ది సెంచరీ’ నమోదు చేసి అర్జెంటీనాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్‌లో అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీనే ధరించింది.

అంతేకాదు, 1998 ప్రపంచకప్‌లో కూడా ఇంగ్లండ్‌పై పెనాల్టీల్లో విజయం సాధించిన సమయంలో అర్జెంటీనా ఇదే నేవీ బ్లూ జెర్సీతో బరిలోకి దిగింది. అయితే 2002 ప్రపంచకప్‌లో సంప్రదాయ జెర్సీ ధరించిన అర్జెంటీనా డేవిడ్ బెక్‌హామ్ పెనాల్టీ గోల్‌తో 0-1 తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో ఈసారి కూడా సెంటిమెంట్ కలిసి వస్తుందనే ఆశతో అర్జెంటీనా మేనేజ్‌మెంట్ ప్రత్యామ్నాయ జెర్సీని ఎంచుకుంది.

ప్రపంచకప్-2026లో ఇప్పటివరకు అర్జెంటీనా ఆరు మ్యాచ్‌లు ఆడగా, ఐదు మ్యాచ్‌ల్లో ప్రధాన జెర్సీతో విజయం సాధించింది. ఒక్కసారి మాత్రమే ఆల్టర్నేట్ జెర్సీ ధరించి జోర్డాన్‌పై 3-1తో గెలిచింది. ఇప్పుడు అదే జెర్సీతో ఇంగ్లండ్‌పై కూడా విజయాన్ని అందుకుని ఫైనల్‌కు చేరాలనే లక్ష్యంతో మెస్సి సేన సిద్ధమవుతోంది.

అయితే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై మెస్సి తొలిసారి సెమీఫైనల్ పోరులో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో, నేవీ బ్లూ జెర్సీ సెంటిమెంట్ మరోసారి అర్జెంటీనాకు అదృష్టాన్ని తీసుకొస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User