రూ.700కు అమ్ముడైన ఎమ్మెల్యే దోశ.. వేలం పాటలో పోటీపడి కొనుగోలు..
సాధారణంగా ఒక దోశ ధర రూ.50 నుంచి రూ.100 వరకు ఉంటుంది. కానీ కర్నూలు జిల్లా ఆదోనిలో మాత్రం ఒక దోశ ఏకంగా రూ.700కు అమ్ముడైంది. అయితే ఆ దోశకు అంత ధర రావడానికి కారణం.. దానిని స్వయంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తయారు చేయడమే.
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు "మీ పార్థసారథి" పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే పార్థసారథి అరుణ జ్యోతి నగర్‌లో స్థానికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమీపంలోని ఓ టిఫిన్ సెంటర్‌కు వెళ్లిన ఆయన, అక్కడ దోశలు వేస్తున్న మహిళతో ముచ్చటించి, స్వయంగా గరిట పట్టి ఒక దోశ వేశారు.
ఆ తర్వాత సరదాగా "ఈ దోశ ఎవరికి కావాలి?" అంటూ అక్కడున్న వారిని ప్రశ్నించారు. పలువురు ఆసక్తి చూపడంతో వెంటనే దోశకు వేలం పాట నిర్వహించారు. రూ.50తో ప్రారంభమైన వేలం క్రమంగా పెరుగుతూ చివరకు రూ.700కు చేరింది.
బీజేపీ మహిళా నేత మల్లిక రూ.700కు ఆ దోశను దక్కించుకున్నారు. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఎమ్మెల్యే హోటల్ నిర్వహిస్తున్న మహిళకు అందజేయడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే పార్థసారథి స్థానిక మేకల పెంపకందారులతో మాట్లాడి, స్వయంగా మేక పాలు పిండుకుని తాగారు. అలాగే గాడిద పాలు విక్రయిస్తున్న వ్యక్తి వద్ద కూడా ఒక గ్లాస్ పాలు తాగుతూ స్థానికులతో సరదాగా మమేకమయ్యారు.
ఎమ్మెల్యే స్వయంగా దోశ వేయడం, దానికి వేలం నిర్వహించడం, రూ.700కు అమ్ముడవడం వంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)