ఇండియా పోస్ట్ పేరుతో కొత్త సైబర్ మోసం.. ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం

Jul 24, 2026 - 13:23
0 4
ఇండియా పోస్ట్ పేరుతో కొత్త సైబర్ మోసం.. ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం

"మీ పార్శిల్‌ను డెలివరీ చేయలేకపోయాం. చిరునామా తప్పుగా ఉంది. రూ.22 చెల్లించి వివరాలు ధృవీకరిస్తే వెంటనే డెలివరీని రీషెడ్యూల్ చేస్తాం" అంటూ ఇండియా పోస్ట్ పేరుతో వస్తున్న ఎస్‌ఎంఎస్‌లు ఇప్పుడు కొత్త సైబర్ మోసాలకు కారణమవుతున్నాయి. అందులోని లింక్ అధికారిక వెబ్‌సైట్‌లా కనిపించడంతో చాలామంది అనుమానం లేకుండా క్లిక్ చేస్తున్నారు. కానీ అదే వారి బ్యాంకు ఖాతాలోని డబ్బును క్షణాల్లో మాయం చేసే ఉచ్చుగా మారుతోంది.

ఇటీవల దేశవ్యాప్తంగా పార్శిల్ డెలివరీ పేరుతో ఫిషింగ్ మోసాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఇండియా పోస్ట్ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి, చిరునామా తప్పుగా ఉందని, చిన్న మొత్తంలో డెలివరీ ఛార్జీ చెల్లించాలని బాధితులను నమ్మిస్తున్నారు. లింక్‌పై క్లిక్ చేసి చెల్లింపు చేయగానే లేదా వ్యక్తిగత వివరాలు నమోదు చేయగానే బ్యాంకింగ్ సమాచారం, ఇతర సున్నితమైన వివరాలు నేరగాళ్ల చేతికి చేరి ఖాతాల్లోని డబ్బు దోచుకుంటున్నారు.

ఇలాంటి మోసాలకు హైదరాబాద్‌లో ఇప్పటికే పలువురు బలయ్యారు. వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన ఓ రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రూ.23.26 లక్షలు, బంజారాహిల్స్‌కు చెందిన మరో వ్యక్తి రూ.2.49 లక్షలు కోల్పోయిన ఘటనలు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), సైబర్ భద్రతా సంస్థలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఇండియా పోస్ట్ ఎప్పుడూ ఎస్‌ఎంఎస్, వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా బ్యాంకు వివరాలు, ఓటీపీ లేదా వ్యక్తిగత సమాచారం అడగదని స్పష్టం చేశాయి. అలాంటి సందేశాలు వస్తే వాటిని నమ్మకుండా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ లేదా సమీప పోస్టాఫీస్ ద్వారా మాత్రమే వివరాలు ధృవీకరించుకోవాలని సూచిస్తున్నాయి.

సైబర్ మోసాల నుంచి ఎలా జాగ్రత్తపడాలి?

* అపరిచిత లింకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు.
* ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, డెబిట్/క్రెడిట్ కార్డు సమాచారం ఎవరికీ చెప్పవద్దు.
* పార్శిల్ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లోనే పరిశీలించండి.
* చిన్న మొత్తమని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి చెల్లింపును ధృవీకరించండి.

మోసానికి గురైతే వెంటనే ఏం చేయాలి?

సైబర్ నేరాల్లో సమయం అత్యంత కీలకం. డబ్బు కట్ అయిన వెంటనే స్పందిస్తే రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిపుణుల ప్రకారం గంటలోపు ఫిర్యాదు చేస్తే 80–90 శాతం వరకు నిధులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

* వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి.
* లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఆన్‌లైన్ ఫిర్యాదు నమోదు చేయండి.
* అవసరమైతే మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ (MRM) ద్వారా రిఫండ్ ప్రక్రియను ప్రారంభించవచ్చు.

సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్న ఈ సమయంలో, అపరిచిత సందేశాలు, లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండటం ద్వారా భారీ ఆర్థిక నష్టాలను నివారించవచ్చు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User