ఐపీఎల్ చరిత్రలోనే చెత్త నిర్ణయం.. ఢిల్లీ నిర్ణయంపై మహమ్మద్ కైఫ్ ఫైర్
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే ఆటగాళ్ల ట్రేడింగ్ వార్తలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా రిషభ్ పంత్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావడానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమవుతుండగా, అందుకు బదులుగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను వదులుకునే అవకాశాలపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్రంగా స్పందించారు.
లక్నో సూపర్ జాయింట్స్ నుంచి రిషభ్ పంత్‌ను ట్రేడ్ చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, కుల్దీప్ యాదవ్‌తో పాటు అదనంగా భారీ నగదు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందించిన కైఫ్.. కుల్దీప్ను వదులుకోవడం ఢిల్లీ యాజమాన్యం చేసే అతిపెద్ద తప్పిదమని హెచ్చరించారు.
తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన కైఫ్.. “ఢిల్లీ గనుక కుల్దీప్ యాదవ్‌ను ట్రేడ్ చేస్తే అది ఐపీఎల్ చరిత్రలోనే చెత్త నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఒక్క సీజన్ ప్రదర్శన ఆధారంగా ఒక ఆటగాడి సామర్థ్యాన్ని అంచనా వేయడం సరికాదు. పదేళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవజ్ఞుడైన ఆటగాడిని ఒకే ఏడాది ఫామ్‌తో జడ్జ్ చేయకూడదు” అని వ్యాఖ్యానించారు.
గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా కుల్దీప్ విషయంలో ఇలాంటి తప్పిదమే చేసిందని కైఫ్ గుర్తుచేశారు. ఒక సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేదనే కారణంతో అతడిని పక్కనపెట్టగా, అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని జట్టులోకి తీసుకుని అవకాశమిచ్చిందని చెప్పారు. ఆ తర్వాత కుల్దీప్ అద్భుత ప్రదర్శనలతో తన విలువను నిరూపించుకున్నాడని పేర్కొన్నారు.
గత సీజన్లో కుల్దీప్ యాదవ్ 10 వికెట్లు తీసినప్పటికీ, 40 సగటు, 10.30 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. అయితే జట్టు మొత్తం వైఫల్యానికి ఒక్క ఆటగాడినే బాధ్యుడిగా చేసి పక్కనపెట్టడం సరైన నిర్ణయం కాదని కైఫ్ అభిప్రాయపడ్డారు.
“కుల్దీప్ లాంటి ప్రత్యేకమైన స్పిన్నర్‌ను కనుగొనడం చాలా కష్టం. క్లిష్ట పరిస్థితుల్లో అతడికి మద్దతుగా నిలవాల్సింది పోయి ట్రేడ్ చేయాలని ఆలోచించడం జట్టుకు నష్టమే. జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ యాజమాన్యం ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలి” అని కైఫ్ సూచించారు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కోచ్ వ్యవస్థలో సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ వంటి దిగ్గజాలు కీలక బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో, కుల్దీప్-పంత్ ట్రేడ్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. కైఫ్ హెచ్చరికలను ఢిల్లీ మేనేజ్మెంట్ పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)