జ్వరంతో బాధపడుతున్న పూరీ జగన్నాథుడు
వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి సీజనల్ వ్యాధులు మనుషులను ప్రభావితం చేయడం సహజం. అయితే భక్తుల విశ్వాసం ప్రకారం సాక్షాత్తు శ్రీ జగన్నాథ స్వామి కూడా ప్రతి ఏడాది జ్యేష్ఠ పౌర్ణమి అభిషేకం అనంతరం జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు భావిస్తారు. ఈ సంప్రదాయాన్ని "అనవాసర" అని పిలుస్తారు.
జ్యేష్ఠాభిషేకం రోజున పవిత్ర జలాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవికి మహాభిషేకం నిర్వహిస్తారు. అభిషేకం అనంతరం స్వామివారికి అస్వస్థత కలిగిందనే భావనతో 15 రోజుల పాటు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తారు. ఈ సమయంలో స్వామివారిని ప్రత్యేక గదిలో ఉంచి విశ్రాంతి కల్పిస్తూ ఆయుర్వేద వైద్యం అందిస్తారు.
ఈ 15 రోజులలో అన్నభోగానికి బదులుగా ఫలాలు, ఔషధ కషాయాలు, మూలికలను మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. అర్చకులు మాత్రమే స్వామివారికి సేవలు అందిస్తారు. ఈ కాలంలో సాధారణ భక్తులకు దర్శనం ఉండదు.15 రోజుల అనంతరం జరిగే నేత్రోత్సవం సందర్భంగా స్వామివారు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు. ఆ తరువాతే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జగన్నాథ రథయాత్ర వైభవంగా ప్రారంభమవుతుంది.

ఈ సంప్రదాయం వెనుక మరో పురాణ కథనం కూడా ప్రచారంలో ఉంది. మాధవదాసు అనే తన ప్రియ భక్తుడు చివరి 15 రోజుల అనారోగ్యాన్ని స్వామివారే స్వీకరించారని, భక్తుని బాధను తనపై తీసుకున్నారనే విశ్వాసం భక్తుల్లో ఉంది. మాధవ దాసుడు చాలాకాలంగా ఒక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన బాధను తగ్గించమని దేవుని ప్రార్థించాడు. కానీ తన పూర్వజన్మ కర్మల కారణంగా అనారోగ్యం ముగియటానికి కేవలం 15 రోజులు మాత్రమే ఇంకా మిగిలి ఉంది. ఆ తర్వాత అతనికి మోక్షం లభిస్తుంది. కానీ తన భక్తుని బాధను చూసిన స్వామి వారి హృదయం చలించిపోయింది. దీంతో మాధవ దాసు కు మిగిలి ఉన్న చివరి 15 రోజులు అనారోగ్యాన్ని స్వయాన స్వామివారి స్వీకరించారట. అందుకే స్వామివారికి జ్వరం, జలుబు వస్తుంది అనేది ఒక కథనం.
ఈ ఆచారం ప్రధానంగా ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అలాగే ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఇతర జగన్నాథ ఆలయాల్లో కూడా అనవాసర, నేత్రోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికత కలిసిన ఈ విశిష్ట ఆచారం జగన్నాథ స్వామి మహిమను చాటిచెబుతుంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)