టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు.. ఇద్దరు కోచ్‌లకు బీసీసీఐ గుడ్‌బై

Jul 29, 2026 - 15:23
0 2
టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు.. ఇద్దరు కోచ్‌లకు బీసీసీఐ గుడ్‌బై

భారత్ క్రికెట్ జట్టులో కోచింగ్ సిబ్బందికి సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సహాయక కోచ్ ర్యాన్ టెన్ డష్కటే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ కాంట్రాక్టులను ఇకపై పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. జూన్ 10తో వీరిద్దరి ఒప్పందాల గడువు ముగిసిందని, ప్రస్తుతం వాటిని కొనసాగించే ఆలోచన బోర్డుకు లేదని తెలిపారు.

గౌతమ్ గంభీర్ కోచింగ్ బృందంలో భాగంగా 2024లో టీమిండియాలో చేరిన ర్యాన్ టెన్ డష్కటే రెండేళ్ల పాటు సేవలందించారు. అయితే కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో ఆయన ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. టీమిండియా నుంచి వైదొలిగిన తర్వాత ఆయన తిరిగి ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ కోచింగ్ స్టాఫ్‌లో చేరే అవకాశాలు ఉన్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి.

ర్యాన్ టెన్, గౌతమ్ గంభీర్‌కు చాలా కాలంగా సన్నిహితుడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున కలిసి పనిచేసిన సమయంలో ఏర్పడిన పరిచయం తర్వాత ఈ స్నేహం మరింత బలపడింది. గంభీర్ సిఫార్సుతోనే ఆయన భారత జట్టు సహాయక కోచ్‌గా ఎంపికయ్యారని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఇక ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించే ప్రక్రియను బీసీసీఐ ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం. వచ్చే నెల శ్రీలంక పర్యటనకు ముందే కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను ఖరారు చేయాలని బోర్డు భావిస్తోంది. ఈ పదవికి అస్సాంకు చెందిన మాజీ క్రికెటర్ సుభదీప్ ఘోష్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఇండియా-ఏ, అండర్-19, భారత మహిళల జట్లతో కలిసి పనిచేస్తున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది మాజీ క్రికెటర్లు, కోచ్‌ల పేర్లను కూడా బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User