తల్లికి వందనం డబ్బుల కోసం దారుణం.. భార్యను గొంతుకోసి హత్య చేసిన భర్త.. అనాథలైన ఇద్దరు చిన్నారులు
అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం కింద జమ చేసిన నగదు విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరకు హత్యకు దారితీసింది. డబ్బులు ఇవ్వలేదన్న ఆగ్రహంతో భర్త తన భార్యను గొంతుకోసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దారుణంతో ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోగా, తండ్రి పోలీసు కేసులో చిక్కడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
పోలీసుల వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా పిటియం మండలం రాపూరివారిపల్లి పంచాయతీ కొత్తపల్లికి చెందిన సురేష్, పద్మావతి దంపతులకు ప్రణీత్, విష్ణు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసింది.
ఈ డబ్బుల విషయంలో గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ డబ్బులు తనకు ఇవ్వాలని సురేష్ కోరగా, పద్మావతి నిరాకరించినట్లు సమాచారం. ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో సురేష్ విచక్షణ కోల్పోయి భార్యపై దాడి చేసి గొంతుకోసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మృతురాలి తల్లి కళావతి తెలిపిన వివరాల ప్రకారం.. సురేష్ గతంలో కూడా పద్మావతిని వేధించేవాడని, ఈసారి డబ్బుల విషయంలో జరిగిన గొడవ చివరకు ఆమె ప్రాణాలు తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో ఐదో తరగతి చదువుతున్న ప్రణీత్, మూడో తరగతి చదువుతున్న విష్ణు తల్లిని కోల్పోగా, తండ్రి నేరారోపణలు ఎదుర్కొంటుండటంతో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషాదంగా మారింది.
కుటుంబంలో చిన్న గొడవగా ప్రారంభమైన వివాదం క్షణికావేశంలో ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుని, ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన విషాద ఘటనగా మిగిలిపోయింది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)