తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. లాఠీచార్జ్‌లో కిందపడిన హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల అరెస్ట్
తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య బహిరంగ చర్చకు సంబంధించిన రాజకీయ వివాదం గురువారం హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తెలంగాణ అప్పులు, గురుకుల టెండర్లలో అక్రమాల అంశాలపై బహిరంగ చర్చకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు తెలంగాణ భవన్ వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు నేతలు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అనంతరం గన్‌పార్క్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని గేటు వద్దే అడ్డుకున్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు కిందపడిపోయారు. అనంతరం పోలీసులు ఆయన్ను పైకి లేపి, హరీష్ రావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్లను అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో తరలించారు.
అరెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన హరీష్ రావు, తాము ఘర్షణ కోసం కాకుండా బహిరంగ చర్చ కోసం వచ్చామని తెలిపారు. గురుకుల టెండర్లకు సంబంధించిన ఆధారాలతో వచ్చిన తమను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు.మరోవైపు, బహిరంగ చర్చకు సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు గన్‌పార్క్‌కు రాకుండా గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కలిసి వస్తే ఒకేసారి సమాధానం ఇస్తానని పేర్కొన్నారు.ఇదే సమయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహ్మద్ అజహరుద్దీన్ గన్‌పార్క్‌కు చేరుకుని, బీఆర్ఎస్ నేతలు చర్చకు హాజరుకాలేదని విమర్శించారు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
తెలంగాణ భవన్ వద్ద జరిగిన తోపులాట, లాఠీచార్జ్, హరీష్ రావు కిందపడిన ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)