'దూకుడు'లో ప్రకాష్ రాజ్ పాత్రకు తొలి ఛాయిస్ శ్రీహరే.. శ్రీను వైట్ల ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటైన 'దూకుడు' సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 9న రీ-రిలీజ్ సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో సినిమా వెనుక జరిగిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
'దూకుడు' కథ కేబీఆర్ పార్క్‌లో పుట్టిందని, సినిమా మేకింగ్ దశలోనే ఇది ఇండస్ట్రీ హిట్ అవుతుందని తనకు నమ్మకం ఉందని శ్రీను వైట్ల తెలిపారు. మహేష్ బాబు ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ, సహకారంతోనే సినిమాలోని ఎన్నో డైలాగులు, సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని చెప్పారు.
ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడించారు. సినిమాలో ప్రకాష్ రాజ్ పోషించిన తండ్రి పాత్ర కోసం మొదట నటుడు శ్రీహరిని అనుకున్నామని చెప్పారు. అయితే అప్పుడే తండ్రి పాత్రలు చేయడానికి శ్రీహరి ఆసక్తి చూపకపోవడంతో ఈ విషయం మహేష్ బాబుకు చెప్పగా, ఆయన "శ్రీహరిని ఇబ్బంది పెట్టొద్దు... ఆ పాత్రను ప్రకాష్ రాజ్‌కు ఇస్తే బాగుంటుంది" అని సూచించినట్లు తెలిపారు. అనంతరం ప్రకాష్ రాజ్‌ను ఎంపిక చేయగా, ఆయన ఆ పాత్రలో అద్భుతంగా నటించారని శ్రీను వైట్ల కొనియాడారు.
అలాగే "మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతాను", "ఏయ్... మళ్లీ వేశాడు" వంటి డైలాగులు థియేటర్లలో భారీ స్పందన తెచ్చాయని గుర్తు చేశారు. ఇస్తాంబుల్ షెడ్యూల్ సమయంలో మహేష్ బాబు డైలాగ్ డెలివరీ తనకు మరింత ఉత్సాహాన్నిచ్చిందన్నారు.
సినిమా మొత్తం 140 రోజుల పాటు చిత్రీకరించగా, టాకీ పార్ట్‌ను కేవలం 42 రోజుల్లో పూర్తి చేశామని శ్రీను వైట్ల వెల్లడించారు. మహేష్ బాబుతో పనిచేయడం ఎప్పుడూ ఒత్తిడిగా అనిపించదని, ఆయన వినయం, సహకారమే 'దూకుడు' విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటని చెప్పారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)