పావురాలకు మేతపై హైకోర్టులో పిటిషన్..ప్రజారోగ్యంపై ఆందోళన
హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా మేత వేయడంపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పావురాల మేతను నియంత్రించేందుకు, వాటి సంఖ్య పెరుగుదలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మూడు వారాల్లో సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది.
పిటిషన్‌లో ఏముంది?
నగరానికి చెందిన వైద్యుడు డాక్టర్ రాధేశ్యామ్ తపాడియా ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. నివాస ప్రాంతాలు, ప్రభుత్వ–ప్రైవేటు ఆసుపత్రులు, రద్దీ ప్రాంతాలు, చారిత్రక కట్టడాల సమీపంలో ఎలాంటి నియంత్రణ లేకుండా పావురాలకు మేత వేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణం ప్రమాదంలో పడుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపిస్తూ, పావురాల సంఖ్య అదుపు తప్పేలా పెరుగుతోందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలతో పాటు వారసత్వ కట్టడాలకు కూడా నష్టం జరుగుతోందని తెలిపారు. అనుమతి లేని ప్రదేశాల్లో మేత వేయడాన్ని నియంత్రించడం, నిబంధనలు రూపొందించడం, ప్రజల్లో అవగాహన కల్పించాలని కోర్టును కోరారు.
హైకోర్టు ఆదేశాలు
వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, పావురాల మేత నియంత్రణకు ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది.
పావురాల వల్ల ఆరోగ్య సమస్యలేంటి?
వైద్య నిపుణుల ప్రకారం, నగరాల్లో పావురాల సంఖ్య అధికంగా పెరగడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.పావురాల ఈకలు, ఎండిపోయిన రెట్టల ధూళి గాలిలో కలవడం వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తవచ్చు.హైపర్‌సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనే అలెర్జీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇది లంగ్ ఫైబ్రోసిస్ వంటి తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలకు దారితీయవచ్చని వైద్యులు చెబుతున్నారు.సిట్టకోసిస్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం, ఛాతీ నొప్పి, న్యుమోనియా వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.పావురాల రెట్టలలో పెరిగే ఫంగస్ కారణంగా హిస్టోప్లాస్మోసిస్, క్రిప్టోకోకోసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్తమా బాధితులకు ఈ ధూళి మరింత ప్రమాదకరంగా మారవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
పర్యావరణంపై ప్రభావం
పావురాలకు అధికంగా ఆహారం వేయడం వల్ల మిగిలిపోయిన ఆహార వ్యర్థాలు కుళ్లిపోవడం, పావురాల రెట్టలు భవనాలను దెబ్బతీయడం, పరిశుభ్రత సమస్యలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా మేత వేయడాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)