ప్రపంచ పెద్దపులుల దినోత్సవాన విషాదం.. నంద్యాలలో ఆడ పులి మృతి
ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నాగలూటి రేంజ్‌లో T66Fగా గుర్తించిన ఆడ పెద్దపులి మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
మునిమడుగు ఏరు సమీపంలో పులి కళేబరాన్ని గుర్తించిన అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టగా, వృద్ధాప్యమే మరణానికి కారణమై ఉండొచ్చని తెలిపారు. ఇటీవల కొంతకాలంగా ఈ పులి సంచారాన్ని అటవీ సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (NTCA) నిబంధనల మేరకు వన్యప్రాణి వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తూ అధికారుల సమక్షంలో పూర్తి చేసిన అనంతరం నిబంధనల ప్రకారం కళేబరాన్ని నిర్వీర్యం చేశారు.
ఈ ఘటనలో వేట, విషప్రయోగం లేదా ఇతర అనుమానాస్పద అంశాలు ఏవీ కనిపించలేదని అటవీశాఖ స్పష్టం చేసింది. ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజునే ఈ ఘటన జరగడం వన్యప్రాణి ప్రేమికులను కలచివేసింది.
ప్రతి ఏడాది జూలై 29న ప్రపంచ పెద్దపులుల దినోత్సవం నిర్వహిస్తారు. పులుల సంరక్షణ, వాటి ఆవాసాల పరిరక్షణపై అవగాహన పెంచడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలోనే అత్యధిక పులుల జనాభా కలిగిన దేశంగా భారత్ పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)