బండ్ల గణేష్ మానవత్వం.. నిరంజన్‌కు రూ.5 లక్షల సాయం
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పాటు స్టార్ హార్ట్ ఉన్న వ్యక్తులు కూడా ఉంటారని మరోసారి నిరూపించారు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్. అరుదైన జన్యుపరమైన వ్యాధి, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్‌కు భారీ ఆర్థిక సాయం అందించి ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు.
ఇప్పటికే ఈ బాలుడికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండగా నిలవడం తెలిసిందే. ఆ తర్వాత అదే స్ఫూర్తితో బండ్ల గణేష్ కూడా ముందుకొచ్చారు.
హనుమకొండ హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల పౌనుగోటి నిరంజన్ గత కొన్నేళ్లుగా అరుదైన జన్యుపరమైన వ్యాధితో పాటు తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంచానికే పరిమితమైన ఆ బాలుడు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారైనా కలవాలని కోరిక వ్యక్తం చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ దృష్టికి చేరింది.
స్పందించిన పవన్ కళ్యాణ్ ఎలాంటి హడావిడి లేకుండా నేరుగా హనుమకొండలోని నిరంజన్ ఇంటికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. అతన్ని ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని ధైర్యం చెప్పారు. తక్షణ సాయంగా రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా బాలుడికి ఐప్యాడ్‌తో పాటు కుక్కపిల్లను కూడా పంపించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

పవన్ కళ్యాణ్ చూపిన ఈ మానవత్వానికి తీవ్రంగా ప్రభావితమైన నిర్మాత బండ్ల గణేష్, తన బ్యానర్ ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’తరపున నిరంజన్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఇచ్చిన మాట ప్రకారం శనివారం హనుమకొండకు వెళ్లిన బండ్ల గణేష్, నిరంజన్ కుటుంబాన్ని కలుసుకుని రూ.5 లక్షల చెక్కును అందజేశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ… “పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన చూపించే మానవత్వమే మాకు స్ఫూర్తి. నిరంజన్ కోరిక నెరవేరడం నా మనసును కదిలించింది. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఏ అవసరం వచ్చినా ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను” అని తెలిపారు.
ఈ ఘటనపై హనుమకొండ ప్రజలతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో బండ్ల గణేష్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సెలబ్రిటీలు కేవలం వెండితెరపైనే కాదు…నిజ జీవితంలోనూ హీరోలేనని మరోసారి నిరూపించిన ఘటనగా ఇది నిలిచింది.
పవన్ కళ్యాణ్ చూపిన మానవత్వానికి స్ఫూర్తిగా బండ్ల గణేష్ చేసిన ఈ సహాయం ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)