యజమాని బంగారంతో గోవా ట్రిప్..చివరికి పోలీసుల చేతికి చిక్కిన డ్రైవర్
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ ఓ కారు డ్రైవర్‌ను దొంగగా మార్చింది. యజమాని ఇంటి పరిస్థితులను పూర్తిగా గమనించిన డ్రైవర్, కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు దొంగిలించాడు. అనంతరం కొంత బంగారాన్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో స్నేహితులతో కలిసి గోవా ట్రిప్‌కు వెళ్లి ఎంజాయ్ చేశాడు. అయితే సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్లకు చెందిన జోసెఫ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన అతడు త్వరగా డబ్బు సంపాదించాలని నేరాలకు పాల్పడటం ప్రారంభించాడు. గతంలో తెనాలిలోని లక్ష్మీ థియేటర్ ఎదురుగా ఉన్న మొబైల్ షాపులో చోరీ చేసి ఐఫోన్లు, ఇతర మొబైల్ ఫోన్లు, నగదు అపహరించినట్లు విచారణలో వెల్లడైంది.
తర్వాత కఠెవరంలో నివసించే ఎస్ఐసీ రిటైర్డ్ ఉద్యోగి సాల్మన్ రాజు వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సమయంలో ఇంటి పరిస్థితులను గమనించిన జోసెఫ్, కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి 234.5 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాల సహాయంతో విచారణ చేపట్టగా జోసెఫ్ నేరాన్ని అంగీకరించాడు.
దొంగిలించిన బంగారంలో 51 గ్రాముల ఆభరణాలను తన స్నేహితుడు బేతపూడి సురేశ్‌కు ఇచ్చాడు. సురేశ్ తన స్నేహితులు పవన్ తేజ, వంశీల సహాయంతో వాటిని పొన్నూరులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. ఆ డబ్బును పంచుకుని గోవా వెళ్లి విహారయాత్ర చేశారు. మిగిలిన బంగారాన్ని కూడా తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి 178 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసులో పాల్గొన్న ఇతరుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)