విద్యుత్ శాఖలో 629 ఉద్యోగాలు.. జూలై 27 వరకు దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంధన వనరుల శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 27వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి స్థాయి నోటిఫికేషన్, పరీక్షా విధానం, సిలబస్, వయోపరిమితి తదితర వివరాలు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల కానున్నాయి.
మొత్తం 629 పోస్టుల్లో ఏపీట్రాన్స్‌కోలో 200, ఏపీజెన్‌కోలో 100, ఏపీఈపీడీసీఎల్‌లో 135, ఏపీఎస్‌పీడీసీఎల్‌లో 134, ఏపీసీపీడీసీఎల్‌లో 60 పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు బీఈ లేదా బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, టెలికాం, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థల వారీగా చూస్తే.. ఏపీజెన్‌కోలో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో 80 పోస్టులు, సివిల్ విభాగంలో 20 పోస్టులు ఉన్నాయి. ఏపీట్రాన్స్‌కోలో 167 ఎలక్ట్రికల్, 23 సివిల్, 10 టెలికాం పోస్టులు భర్తీ చేయనున్నారు.
పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టి ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)