తిరుపతి పాత రైల్వే స్టేషన్ ఇక జ్ఞాపకమే.. కాలగర్భంలోకి అలనాటి కట్టడం, భావోద్వేగానికి గురవుతున్న స్థానికులు
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు, తిరుపతి వాసులకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన పాత తిరుపతి రైల్వే స్టేషన్ భవనం ఇక చరిత్రలో కలిసిపోనుంది. అమృత్ భారత్ స్టేషన్ అభివృద్ధి పథకం కింద ఆధునిక రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో, దశాబ్దాల చరిత్ర కలిగిన పాత భవనాన్ని తొలగిస్తున్నారు. దీంతో తిరుపతి ప్రజలు, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు.
గోవిందరాజస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ ఎన్నో తరాల ప్రయాణాలకు సాక్ష్యంగా నిలిచింది. ఒకప్పుడు తిరుమలకు వచ్చే భక్తులకు ఇదే ప్రధాన ప్రవేశ ద్వారం. రైల్వే స్టేషన్ నుంచి గోవిందరాజస్వామి ఆలయ దర్శనం చేసి, అక్కడి నుంచి అలిపిరి కాలినడక మార్గం వైపు భక్తులు వెళ్లే దృశ్యాలు తిరుపతి ప్రత్యేకతగా ఉండేవి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్టులో స్థానిక నెటిజన్ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. స్టేషన్ సమీపంలోని సత్రాలకు వెళ్లిన రోజులు, అర్ధరాత్రి స్నేహితులతో కలిసి టీ, టిఫిన్ చేసిన సందర్భాలు, స్టేషన్ ఎదురుగా ఉండే ప్రసిద్ధ కేరళ టీ దుకాణం, గుర్రపు బండ్లు, ఎద్దుల బండ్లు, పాత బస్టాండ్ వంటి ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పాత రైల్వే స్టేషన్‌తో ఉన్న అనుబంధాన్ని వివరించారు.
ఒకప్పుడు బొగ్గుతో నడిచే రైళ్లను చూసిన ఈ స్టేషన్... నేడు వందే భారత్ వంటి అత్యాధునిక రైళ్లకు స్వాగతం పలుకుతోంది. గతంలో పరిమిత సంఖ్యలో రైళ్లు నడిచే ఈ స్టేషన్ ప్రస్తుతం రోజుకు వందకు పైగా రైళ్ల రాకపోకలతో దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే యాత్రికుల స్టేషన్లలో ఒకటిగా మారింది.
తిరుపతి రైల్వే స్టేషన్ చరిత్ర 1891లో ప్రారంభమైంది. దక్షిణ భారత రైల్వే కంపెనీ ఆధ్వర్యంలో మీటర్ గేజ్ లైన్‌గా ప్రారంభమైన ఈ స్టేషన్, తర్వాత బ్రాడ్ గేజ్‌గా మారి భక్తుల రాకపోకలకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ప్రస్తుతం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సుమారు రూ.300 కోట్లకు పైగా వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. ఉత్తర, దక్షిణ వైపులా కొత్త భవనాలు, ఎయిర్ కాన్కోర్స్లు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, విశాలమైన ప్రయాణికుల వసతులతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు.
పాత భవనం కనుమరుగవుతున్నా... దానితో ముడిపడిన జ్ఞాపకాలు మాత్రం తిరుపతి ప్రజల హృదయాల్లో ఎప్పటికీ సజీవంగానే నిలిచిపోతాయని స్థానికులు భావోద్వేగంగా చెబుతున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)