శ్రీశాంత్‌కు ఊరట.. మూడేళ్ల నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్
టీమిండియా మాజీ క్రికెటర్ ఎస్. శ్రీశాంత్‌కు కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) ఊరటనిచ్చింది. గతంలో ఆయనపై విధించిన మూడేళ్ల నిషేధాన్ని అధికారికంగా ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశాంత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో పాటు తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఏ వెల్లడించింది.కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారనే కారణంతో శ్రీశాంత్‌పై ఇటీవల మూడేళ్ల నిషేధం విధించారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన తిరువనంతపురం మున్సిఫ్ కోర్టును ఆశ్రయించినప్పటికీ, కోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది.
ఆ తర్వాత శ్రీశాంత్ కేసీఏకు అధికారికంగా క్షమాపణలు తెలియజేస్తూ లేఖ పంపించారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ విచారం వ్యక్తం చేశారు. ఈ అంశంపై బుధవారం నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో చర్చించిన కేరళ క్రికెట్ అసోసియేషన్, ఆయనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది.
అయితే భవిష్యత్తులో కేసీఏ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీశాంత్‌కు హెచ్చరిక కూడా జారీ చేసింది.
నిషేధం ఎత్తివేయడంతో కేరళ క్రికెట్ లీగ్ (KCL) మూడో సీజన్లో ఏరీస్ కొల్లం సెయిలర్స్ ఫ్రాంచైజీ సహ యజమానిగా శ్రీశాంత్ కొనసాగేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఆయన మళ్లీ కేరళ క్రికెట్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే అవకాశం లభించింది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)