స్మశానం కోసం ఊరంతా ఏకమై వినూత్న నిరసన.. మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
శ్రీ సత్యసాయి జిల్లాలో స్మశాన వాటిక కోసం గ్రామస్తులు చేపట్టిన వినూత్న నిరసన కలకలం రేపింది. సోమందేపల్లి మండలం కోనతట్టుపల్లి గ్రామానికి స్మశాన వాటిక లేకపోవడంతో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు చివరకు మృతదేహంతోనే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. స్మశానానికి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ అధికారులకు గడువు విధించారు.
గ్రామస్తుల కథనం ప్రకారం, కోనతట్టుపల్లి గ్రామంలో చనిపోయిన వారిని ఖననం లేదా దహనం చేయడానికి ప్రత్యేకంగా స్మశాన స్థలం లేదు. ఈ సమస్యపై పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందడంతో, మృతదేహాన్ని నేరుగా సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి తహసీల్దార్ చాంబర్ ముందు ఉంచి నిరసన చేపట్టారు. "స్మశానానికి స్థలం కేటాయిస్తారా... లేక మృతదేహాన్ని ఇక్కడే వదిలి వెళ్లాలా?"అంటూ అధికారులను ప్రశ్నించారు.
అనూహ్యంగా మృతదేహంతో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టడంతో అధికారులు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, స్మశాన వాటిక కోసం స్థలం కేటాయించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అధికారుల హామీతో గ్రామస్తులు మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకరించారు. అయితే, వారం రోజుల్లో స్మశాన స్థలం కేటాయించకపోతే ఇకపై గ్రామంలో ఎవరైనా మృతిచెందితే వారి మృతదేహాలను తహసీల్దార్ కార్యాలయం ఎదుటే ఉంచి నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత మరోసారి వెలుగులోకి వచ్చింది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)