తల్లి త్యాగం ఫలించింది .. బిడ్డను కాపాడి చూడకుండానే కన్నుమూసిన ఆశ కార్యకర్త
మార్కాపురం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత మాతృత్వాన్ని పొందిన ఓ ఆశ కార్యకర్త, తన బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులను కన్నీటి పర్యంతం చేసింది. వైద్యులు ముందుగానే ప్రాణాపాయం ఉందని హెచ్చరించినా, తన బిడ్డను కాపాడాలనే తల్లి నిర్ణయం చివరికి విషాదాంతంగా మారింది.
అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన గుంటు లీలమ్మ (40) ఆశ కార్యకర్తగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేది. 2018లో వివాహం చేసుకున్న ఆమెకు చాలా కాలం పాటు సంతానం కలగలేదు. ఇటీవల గర్భం దాల్చడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.
అయితే గర్భధారణ సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో లీలమ్మకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ పరిస్థితిలో గర్భాన్ని కొనసాగించడం ప్రమాదకరమని సూచించినప్పటికీ, ప్రత్యేక చికిత్సతో గుండెకు స్టంట్ అమర్చిన అనంతరం ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడింది. కానీ ప్రసవ సమయం దగ్గరపడే కొద్దీ పరిస్థితి మళ్లీ విషమించింది.
తీవ్ర అస్వస్థత కారణంగా ఆమెను తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డల్లో ఒకరిని మాత్రమే కాపాడే పరిస్థితి ఉండొచ్చని వైద్యులు కుటుంబ సభ్యులకు వివరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తన బిడ్డ క్షేమంగా జన్మించాలనే పట్టుదలతో లీలమ్మ సిజేరియన్‌కు అంగీకరించింది.
వైద్యుల శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో పండంటి మగబిడ్డ జన్మించాడు. అయితే ప్రసవం అనంతరం లీలమ్మ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. పుట్టిన బిడ్డను ఒక్కసారి కూడా చూసుకోలేకపోవడం ఈ ఘటనను మరింత విషాదకరంగా మార్చింది.
లీలమ్మ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగానే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆశ కార్యకర్తగా ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆరోగ్యశాఖ అధికారులు, సహచర సిబ్బంది, గ్రామస్థులు నివాళులర్పించారు. ఆమె త్యాగం స్థానికంగా ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)