హైదరాబాద్ మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. కేంద్రమంత్రులతో రేవంత్ భేటీ
హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పలువురు కేంద్రమంత్రులతో జరిపిన చర్చలు సానుకూల ఫలితాలు ఇచ్చాయి. మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ మెట్రో తొలి దశ స్వాధీనం, రెండో దశ విస్తరణ అంశాలపై రాజకీయంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించారు. ముందుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన ఆయన.. అనంతరం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) రుణం, తెలంగాణలో చేపట్టనున్న పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చించారు.
మెట్రో ఫేజ్-1 వాల్యుయేషన్, ఫేజ్-2 విస్తరణకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ క్యాప్స్‌ను కన్సల్టెంట్‌గా నియమించాలని నిర్ణయించారు. ఎస్బీఐ క్యాప్స్ సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉండనుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.
మెట్రో తొలి దశ ఆస్తుల విలువ నిర్ధారణ, ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ, రెండో దశ విస్తరణకు అవసరమైన నిధులు, ఐఆర్ఎఫ్సీ నుంచి తక్కువ వడ్డీపై రుణం పొందే అవకాశాలపై ఎస్బీఐ క్యాప్స్ సమగ్ర నివేదిక ఇవ్వనుంది.
ఈ నివేదిక ఆధారంగానే కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తదుపరి ఆమోదాలు, నిధుల విడుదలపై నిర్ణయం తీసుకోనుంది. కన్సల్టెంట్ బృందంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధితో పాటు తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి కూడా సభ్యుడిగా ఉంటారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన రెండో దశ మెట్రో విస్తరణ ప్రణాళికలో భాగంగా 70 కిలోమీటర్లకు పైగా కొత్త మెట్రో మార్గాలను ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు అమలైతే హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.
మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్రం సానుకూలంగా స్పందించడంతో తెలంగాణ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఎస్బీఐ క్యాప్స్ నివేదిక అనంతరం మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు అమలుకు మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)