పాలమూరు చిన్నారి ప్రపంచ రికార్డు.. 112 సెకన్లలో వరల్డ్ మ్యాప్ గీసి అరుదైన ఘనత
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల చిన్నారి అభయ్ మురారి అరుదైన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ రికార్డు సాధించాడు. కేవలం 112 సెకన్లలో ప్రపంచ పటాన్ని అత్యంత ఖచ్చితత్వంతో గీసి 'ఇన్‌జీనియస్ చామ్' (Ingenious Champ) అంతర్జాతీయ రికార్డు బుక్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు.
మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన బాలాజీ వెంకట రమణారావు, చరిత దంపతుల కుమారుడైన అభయ్ మురారి ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే ప్రపంచ దేశాలు, ఖండాలు, భౌగోళిక అంశాలపై అతనికి ప్రత్యేక ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు నిరంతరం ప్రోత్సహించారు.
జూన్ 13న నిర్వహించిన ఆన్‌లైన్ ప్రపంచ రికార్డు పరీక్షలో అభయ్ మురారి కేవలం 112 సెకన్లలో ప్రపంచ పటాన్ని పూర్తి చేసి, గతంలో ఉన్న 130 సెకన్ల ప్రపంచ రికార్డును అధిగమించాడు. అనంతరం నిర్వాహకులు అతని ప్రదర్శనను పరిశీలించి జూన్ 25న అధికారికంగా ప్రపంచ రికార్డును ధృవీకరించారు.
ఇటీవల పోస్టు ద్వారా ప్రపంచ రికార్డు ధ్రువీకరణ పత్రం, ప్రతిష్టాత్మక మెడల్ అభయ్ మురారికి అందాయి. చిన్న వయస్సులోనే ప్రపంచ స్థాయిలో ప్రతిభ చాటిన ఈ పాలమూరు బుడతడిపై స్థానికులు, విద్యావేత్తలు, ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)