లెక్చరర్ హేళనతో రెండో ర్యాంకర్ బలవన్మరణం.. సూసైడ్ నోట్‌లో సంచలన ఆరోపణలు
జోగుళాంబ గద్వాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చదువులో ప్రతిభ కనబర్చిన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి, కళాశాలలో ఎదురైన అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. జిల్లాలో రెండో ర్యాంక్ సాధించిన విద్యార్థి తరుణ్ (17) మృతికి సంబంధించి వెలుగులోకి వచ్చిన వివరాలు అందరినీ కలచివేస్తున్నాయి.
కొత్తపల్లి గ్రామానికి చెందిన తరుణ్ గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి జిల్లాలో రెండో ర్యాంక్ దక్కించుకున్నాడు. అయితే కళాశాలలో జరిగిన ఓ ఘటన అతడిని తీవ్ర మనోవేదనకు గురి చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
గత శనివారం తరగతి గదిలో ఒక మహిళా లెక్చరర్, మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థితో పోలుస్తూ తరుణ్‌ను అందరి ముందు విమర్శించినట్లు సమాచారం. దీనిపై తరుణ్ అభ్యంతరం వ్యక్తం చేయగా, లెక్చరర్ అతడిని తీవ్రంగా మందలించి చెంపపై కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన తరుణ్, రెండు రోజుల పాటు మౌనంగా ఉండి చివరకు ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆత్మహత్యకు ముందు మూడు పేజీల లేఖ రాసిన తరుణ్, తన మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఒక విద్యార్థిని అతిగా పొగడుతూ, మరొకరిని అందరి ముందు అవమానించడం సరికాదని, ఉపాధ్యాయులు విద్యార్థులను నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించాలని తన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. తనకు జరిగిన అవమానం తట్టుకోలేకపోయానని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే తన ఆత్మకు శాంతి కలుగుతుందని రాశాడని సమాచారం.
ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ స్పందిస్తూ, తరుణ్ సోమవారం ఉదయం తనను కలిసి జరిగిన విషయాన్ని వివరించాడని తెలిపారు. విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చామని, సంబంధిత లెక్చరర్‌ను కూడా హెచ్చరించామని చెప్పారు. అయితే కొద్ది గంటల్లోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థి మృతితో కొత్తపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, విద్యార్థి కుటుంబ సభ్యులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)