AMB సినిమాస్‌కు రూ.1.1 కోట్ల జరిమానా.. జీఎస్టీఏటీ కీలక ఆదేశాలు
ప్రముఖ నటుడు మహేష్ బాబు భాగస్వామ్యం ఉన్న AMB సినిమాస్‌తో పాటు తెలంగాణలోని మరో ఐదు సినిమా థియేటర్లకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (GSTAT) యాంటీ ప్రాఫిటీరింగ్ డివిజన్ భారీ జరిమానా విధించింది. జీఎస్టీలో ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపు ప్రయోజనాలను ప్రేక్షకులకు బదిలీ చేయకుండా టికెట్ బేస్ ధరలను పెంచి అదనపు లాభాలు పొందినట్లు గుర్తించిన ట్రిబ్యునల్, మొత్తం ఆరు థియేటర్లు కలిపి సుమారు రూ.1.7 కోట్లను కేంద్ర, తెలంగాణ వినియోగదారుల సంక్షేమ నిధుల్లో జమ చేయాలని ఆదేశించింది.
ఈ కేసులో అత్యధికంగా గచ్చిబౌలిలోని AMB సినిమాస్‌పై రూ.1.1 కోట్ల భారం పడింది. ఇప్పటికే స్వచ్ఛందంగా చెల్లించిన మొత్తాన్ని మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. టికెట్ ధరల పెంపు రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతోనే జరిగిందని, నిర్వహణ వ్యయాలు పెరగడంతో ధరలను సవరించామని యాజమాన్యం చేసిన వాదనలను ట్రిబ్యునల్ తిరస్కరించింది. రాష్ట్ర అనుమతులు ఉన్నప్పటికీ, సీజీఎస్టీలోని యాంటీ ప్రాఫిటీరింగ్ నిబంధనలను పాటించాల్సిందేనని పేర్కొంది.
అసలు వివాదం ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం 2019 జనవరి 1 నుంచి సినిమా టికెట్లపై జీఎస్టీ రేట్లను తగ్గించింది. రూ.100 వరకు ఉన్న టికెట్లపై పన్నును 18 శాతం నుంచి 12 శాతానికి, రూ.100 కంటే ఎక్కువ ధర ఉన్న టికెట్లపై 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాన్ని ప్రేక్షకులకు అందించాల్సిన బాధ్యత థియేటర్లపై ఉంది.
అయితే, సంబంధిత థియేటర్లు టికెట్ బేస్ ధరలను పెంచడం ద్వారా మొత్తం టికెట్ ధరను దాదాపు యథాతథంగా కొనసాగించాయని ట్రిబ్యునల్ గుర్తించింది. దీంతో పన్ను తగ్గింపు వల్ల వినియోగదారులకు అందాల్సిన లాభం థియేటర్లకే చేరిందని పేర్కొంది. ఇది సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 171 ప్రకారం యాంటీ ప్రాఫిటీరింగ్ నిబంధనల ఉల్లంఘనగా తేల్చింది.
ఇతర థియేటర్లకూ జరిమానాలు
AMB సినిమాస్‌తో పాటు హైదరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లోని విశ్వనాథ్ సినిమా హాల్ 70MM, జ్యోతి థియేటర్, బ్రహ్మరాంబ థియేటర్, ASR సినిమా, కుమార్ 70MM థియేటర్లపై కూడా ట్రిబ్యునల్ చర్యలు తీసుకుంది. ఆయా థియేటర్లు నిర్ణయించిన మొత్తాలను వడ్డీతో సహా సంబంధిత వినియోగదారుల సంక్షేమ నిధుల్లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ తీర్పుతో జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకుండా అదనపు లాభాలు పొందే సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవని GSTAT స్పష్టం చేసింది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)