NBK 111 షూటింగ్‌లో బాలకృష్ణకు గాయం.. యాక్షన్ సీన్ చేస్తుండగా మోకాలికి స్వల్ప గాయాలు
నటసింహం నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న NBK 111 సినిమా షూటింగ్‌లో భాగంగా కాకినాడ పోర్టులో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది.
దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ, మంచు మనోజ్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ మోకాలికి గాయం కావడంతో చిత్రబృందం వెంటనే సమీప ఆస్పత్రికి తరలించింది.
బాలకృష్ణకు గాయమైందన్న వార్తతో అభిమానులు ఆందోళన చెందారు.అయితే ఆయనకు స్వల్ప గాయాలే అయ్యాయని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం కొద్ది రోజుల విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK 111 ముంబై మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన 'వీరసింహారెడ్డి' విజయానంతరం వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, ఈ చిత్రాన్ని డిసెంబర్ 24, 2026 న విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)