ఆమ్లెట్ కోసం అత్తా–కోడళ్ల గొడవ.. కోడలు మృతి
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్తకు ఆమ్లెట్ వడ్డించిందని అత్తతో తలెత్తిన కుటుంబ కలహాలు చివరకు ఓ యువతి ఆత్మహత్యతో ముగిశాయి. చిన్న కారణంతో మొదలైన గొడవ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీకాకుళంలోని ఆదివారపేటకు చెందిన కోనాడ నాగరాజు స్థానిక వస్త్ర దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం పొందూరు మండలం బొడ్డేపల్లికి చెందిన షర్మిల (26)ను వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం ఇద్దరూ ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నారు.
ఈ నెల 8న విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన నాగరాజుకు షర్మిల భోజనంతో పాటు ఆమ్లెట్ కూడా వడ్డించింది. అదే సమయంలో పక్కనే భోజనం చేస్తున్న చిన్న కుమారుడికి ఆమ్లెట్ ఎందుకు వేయలేదని అత్త దమయంతి ప్రశ్నించడంతో అత్తా–కోడళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ప్లేట్ విసిరేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ఈ వివాదం సమయంలో భర్త స్పందించకపోవడం, తరచూ అత్తతో గొడవలు జరుగుతుండటంతో షర్మిల తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. అదే రాత్రి అందరూ నిద్రించిన తర్వాత ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలను విచారణలో నిర్ధారించనున్నట్లు పోలీసులు తెలిపారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)