మూడు రోజుల క్రితం సీఎం ముందే కలలు చెప్పింది.. ఇప్పుడు శవమై మిగిలింది
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మూడు రోజుల క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ధైర్యంగా మాట్లాడి, జీవితంలో పెద్ద స్థాయికి చేరుకుని "షైనింగ్ స్టార్" అవుతానని చెప్పిన పదో తరగతి విద్యార్థిని శివాని.. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేస్తోంది.
ఇర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శివాని, ఇటీవల జరిగిన "తల్లికి వందనం" కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడింది. భవిష్యత్తులో తాను మంచి స్థాయికి చేరుకుని, ఆయన చేతుల మీదుగానే అవార్డు అందుకుంటానని చెప్పింది. ఆమె మాటలకు సీఎం అభినందనలు తెలియజేయడంతో పాటు, కలిసి భోజనం చేసి, సెల్ఫీ కూడా దిగారు. భవిష్యత్తులో తాను సాధించే విజయాలను తనకు తెలియజేయాలని కూడా ప్రోత్సహించారు.
అయితే ఆ ఉత్సాహంగా కనిపించిన విద్యార్థినే కేవలం మూడు రోజుల వ్యవధిలో ప్రాణాలు తీసుకోవడం విషాదంగా మారింది. కుటుంబ సభ్యులకు ఉద్దేశించి రాసిన లేఖలో తన మనసులోని బాధను వ్యక్తం చేసింది. తల్లిదండ్రుల కోసం ఎంతో చేయాలని అనుకున్నానని, వారు కలలు కన్న జీవితాన్ని ఇవ్వాలని ఆశించానని, కానీ తాను ఆ ఆశలను నెరవేర్చలేకపోతున్నాననే వేదనను వెల్లడించింది. బతకాలని ఉన్నా పరిస్థితులు చాలా భారంగా అనిపిస్తున్నాయని రాసింది.
అలాగే కుటుంబ సభ్యులు ఎప్పటికైనా కలిసిపోవాలని, పరస్పరం ద్వేషించుకోవద్దని తన చివరి కోరికగా పేర్కొంది. అన్నయ్య, వదిన, తల్లి, అమ్మమ్మ అందరూ కలిసి సంతోషంగా ఉండాలని కోరుతూ భావోద్వేగంగా వీడ్కోలు పలికింది. ఆమె రాసిన లేఖ చదివిన వారందరినీ కంటతడి పెట్టిస్తోంది.
ఈ ఘటనతో కుటుంబ కలహాలు, భావోద్వేగ ఒత్తిడి చిన్నారులపై ఎంతటి ప్రభావం చూపుతాయనే అంశం మరోసారి చర్చకు వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. శివాని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
NOTE:మీకు లేదా మీకు తెలిసిన ఎవరికైనా ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నట్లయితే, వెంటనే నమ్మకమైన కుటుంబ సభ్యుడు, స్నేహితుడు లేదా మానసిక ఆరోగ్య నిపుణుడితో మాట్లాడండి. భారత ప్రభుత్వ "జీవన్ సాథీ" హెల్ప్‌లైన్ 1800 233 3330 లేదా సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ 1800 599 0019 లేదా నిమ్హాన్స్ హెల్ప్‌లైన్ 080-26995000ను సంప్రదించవచ్చు. తక్షణ సహాయం అందుబాటులో ఉంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)