నిజమైన నాగుపాముతో షూటింగ్.. రాత్రంతా నిద్రపోలేదు.. 'అమ్మోరు' నటి సునయన షాకింగ్ రివీల్!
తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన భక్తిరస చిత్రం 'అమ్మోరు' గురించి నటి సునయన తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో బాలనటిగా నటించిన ఆమె.. షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న ఓ భయానక అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
ఓ సన్నివేశం కోసం నిజమైన నాగుపామును చేతిలో పట్టుకుని నటించాల్సి వచ్చిందని సునయన తెలిపారు. పాము కోరలు తీసేసి, నోరు కుట్టేసినా.. అది నిజమైన నాగుపామే కావడంతో తీవ్ర భయానికి గురయ్యానన్నారు. నటి సౌందర్య చేతిలో నుంచి పామును తీసుకుని పట్టుకోవాల్సిన ఆ సన్నివేశం పూర్తయ్యాక కూడా భయంతో ఆ రాత్రంతా నిద్రపట్టలేదని చెప్పారు. చివరికి ఎంతో కష్టపడి చేసిన ఆ సీన్‌ను సినిమాలో ఉపయోగించలేదని వెల్లడించారు.
'అమ్మోరు' సినిమాలోని డ్యాన్స్ సన్నివేశాల గురించి కూడా ఆమె మాట్లాడారు. చిన్నప్పటి నుంచే కూచిపూడి నృత్యం నేర్చుకోవడంతో డ్యాన్స్ చేయడం సులభమైందన్నారు. సినిమా విడుదలైన మొదట్లో పెద్దగా స్పందన లేకపోయినా.. తర్వాత భారీ విజయాన్ని సాధించిందని తెలిపారు. థియేటర్ల ముందు అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి, రథయాత్రల్లో తనను తీసుకెళ్లిన రోజులు జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలుగా నిలిచాయని గుర్తు చేసుకున్నారు.
విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లో ప్రేక్షకులు చూపిన అభిమానాన్ని స్మరించుకున్న సునయన.. నీలి రంగు మేకప్ వల్ల చర్మ సమస్యలు ఎదురైనా.. 'అమ్మోరు' సినిమా తనకు జీవితాంతం నిలిచిపోయే గుర్తింపును ఇచ్చిందన్నారు. ఇప్పటికీ ఏ కష్టం వచ్చినా అమ్మవారి ఆశీస్సులు తనకు అండగా ఉంటాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)