"తారక్ స్వయంగా చెబితే అన్ని కార్యక్రమాలు ఆపేస్తాం"..RAW ఎన్టీఆర్ టీమ్ కీలక ప్రకటన
కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన RAW ఎన్టీఆర్ సంస్థ తొలిసారి మీడియా ముందుకు వచ్చి తమ కార్యకలాపాలపై వివరణ ఇచ్చింది. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేసే ఉద్దేశం తమకు లేదని, ఆయనపై ఉన్న అభిమానంతోనే సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా వచ్చి ఆపాలని చెబితే తమ కార్యక్రమాలన్నింటినీ వెంటనే నిలిపివేస్తామని తెలిపారు.
తమ సంస్థ చేపట్టనున్న "ఊరు వాడ సేవా" కార్యక్రమం గురించి సాయి రూప్ వివరించారు. ఇందులో మూడు ప్రధాన విభాగాలు ఉంటాయని చెప్పారు. "సేవతో యువ జాగృతి" ద్వారా యువతను సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడం లక్ష్యమన్నారు. "మన ఊరు మన బాధ్యత" కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను గుర్తించి స్థానికుల సహకారంతో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే రైతుల సమస్యలపై ప్రత్యేక సదస్సులు నిర్వహించి వ్యవసాయ రంగానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
"ఊరి మాట పాలకులదాకా" కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లే వేదికను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ పేరును చెడగొట్టే పనులు తమ సంస్థ ఎప్పటికీ చేయదని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
గత వారం రోజులుగా తమ సంస్థపై అసత్య ప్రచారం జరుగుతోందని సాయి రూప్ ఆరోపించారు. వంద కోట్ల మోసం చేశారంటూ, అభిమానుల పేరుతో దందా చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నారు. ఎన్టీఆర్ కార్యాలయం పేరుతో విడుదలైన లేఖపై కూడా అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన, తారక్ స్వయంగా తమతో మాట్లాడితే తమ కార్యక్రమాలను వెంటనే నిలిపివేస్తామని మరోసారి స్పష్టం చేశారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)