తిరుమలలో కోరుకున్న కోరిక.. 3 రోజుల్లోనే నెరవేరింది: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సమయంలో తన కుమారుడు విజయ్‌కు రాజ్యసభ సభ్యత్వం రావాలని మనస్ఫూర్తిగా మొక్కుకున్నానని తెలిపారు. ఆ తర్వాత కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రాజ్యసభ సీటు రావడం శ్రీవారి అనుగ్రహమేనని అన్నారు. తాను కోరుకున్న కోరికను శ్రీవారు వెంటనే నెరవేర్చారని ఆనందం వ్యక్తం చేశారు.
తిరుమల దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు.. ప్రస్తుతం తాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీకి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమిటీ సభ్యులతో కలిసి ఇప్పటికే విశాఖపట్నం జూను సందర్శించామని, త్వరలో తిరుపతి జూపార్క్‌ను పరిశీలించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని చెప్పారు.
ఆసియాలోనే సుమారు 3 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రత్యేక జూపార్క్ తిరుపతిలోనే ఉందని పేర్కొన్న ఆయన.. రోజూ తిరుమలకు వేలాదిమంది భక్తులు వచ్చినప్పటికీ జూపార్క్‌కు మాత్రం చాలా తక్కువ మంది సందర్శకులు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన సౌకర్యాల లేమి, నీటి సమస్య వంటి కారణాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
టీటీడీ సహకారంతో తిరుపతి జూపార్క్‌ను మరింత అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తామని స్పీకర్ తెలిపారు. అవసరమైన నిధులు, మౌలిక వసతులపై జిల్లా కలెక్టర్‌తో సమావేశమై చర్చిస్తామని చెప్పారు. తిరుమలకు వచ్చే భక్తుల్లో కనీసం సగం మంది కూడా జూపార్క్‌ను సందర్శించేలా అభివృద్ధి చేస్తే పర్యాటక రంగానికి, ప్రభుత్వ ఆదాయానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)