ముంబై ఆస్పత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్..సర్జరీ ఖర్చు సొంతంగా భరించిన డిప్యూటీ సీఎం

Jul 15, 2026 - 16:46
0 3
ముంబై ఆస్పత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్..సర్జరీ ఖర్చు సొంతంగా భరించిన డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకున్న అనంతరం ఆస్పత్రి నుంచి నేరుగా హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

డిశ్చార్జ్ సందర్భంగా తనకు శస్త్రచికిత్స నిర్వహించిన ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్థీవాలాను పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. వైద్య సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్‌కు చిత్రపటాన్ని బహూకరించారు.

వైద్యుల సూచనల మేరకు పవన్ కళ్యాణ్ మరో మూడు వారాల తర్వాత ఫిజియోథెరపీ ప్రారంభించనున్నారు. శస్త్రచికిత్స చేసిన భుజం పూర్తిగా కోలుకోవడానికి సుమారు నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.

డాక్టర్ దిన్షా పార్థీవాలా కోకిలాబెన్ ఆస్పత్రిలో సెంటర్ ఫర్ స్పోర్ట్స్ మెడిసిన్ హెడ్ గా, అలాగే ఆర్థ్రోస్కోపీ అండ్ షోల్డర్ సర్వీసెస్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన ఆయన పదివేలకు పైగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. భారత క్రికెటర్లు రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్ సహా పలువురు ప్రముఖ క్రీడాకారులకు చికిత్స అందించారు.

ఇక శస్త్రచికిత్స, ఆస్పత్రి, ముంబై ప్రయాణానికి సంబంధించిన అన్ని ఖర్చులను పవన్ కళ్యాణ్ స్వయంగా తన వ్యక్తిగత నిధుల నుంచే భరించినట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ప్రభుత్వ నిధులను వ్యక్తిగత వైద్య అవసరాల కోసం వినియోగించకూడదనే తన వ్యక్తిగత విధానానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ పేర్కొంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User