ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం.. 14 రోజుల పూర్తి షెడ్యూల్ ఇదే
ఓరుగల్లు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస శాకాంబరీ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ పౌర్ణమి వరకు మొత్తం 14 రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
మొదటి రోజు సహస్ర కలశాభిషేకం, గణపతి పూజ, పూర్వాంగ విధి కార్యక్రమాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
ఈ ఉత్సవాల ప్రత్యేకత ఏమిటంటే... దేశంలో తొలి శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించే ఆలయంగా భద్రకాళి దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ప్రారంభమైన అనంతరమే దేశంలోని ఇతర ప్రాంతాల్లో శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది.
ఈ 14 రోజులపాటు అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో శాకాంబరీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శాకాంబరీ దేవిని దర్శిస్తే కరువు, కాటకాలు తొలగి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సుభిక్షం కలుగుతాయని భక్తుల విశ్వాసం.
శాకాంబరీ ఉత్సవాల షెడ్యూల్
*జూలై 16: కపాలినీ క్రమం, భగమాలినీ క్రమం
*జూలై 17: కుల్లా క్రమం, నిత్యక్లిన్నా క్రమం
*జూలై 18: కురుకుల్లా క్రమం, భేరుండా క్రమం
*జూలై19: విరోధినీ క్రమం, వహ్నివాసినీ క్రమం
*జూలై 20: విప్రచిత్తా క్రమం, మహావజ్రేశ్వరీ క్రమం
*జూలై 21: ఉగ్రా క్రమం, శివదూతీ క్రమం
*జూలై 22: ఉగ్రప్రభా క్రమం, త్వరితా క్రమం
*జూలై 23: దీప్తా క్రమం, కులసుందరీ క్రమం
*జూలై 24: నీలా క్రమం, విజయా క్రమం
*జూలై 25: ఘనా క్రమం, నీలపతాకా క్రమం
*జూలై 26: బలాకా క్రమం, విచిత్రా క్రమం
*జూలై 27: మాత్రా క్రమం, సర్వమంగళా క్రమం
*జూలై 28: ముద్రా క్రమం, జ్వాలామాలినీ క్రమం
*జూలై 29 (పౌర్ణమి): మితా క్రమం –సంపూర్ణ శాకాంబరీ అలంకార దర్శనం
ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వేలాదిగా వచ్చే భక్తులు అమ్మవారి దివ్య దర్శనం పొందేందుకు తరలివస్తున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)