యూట్యూబ్‌లో చూసి వైన్ తయారీ, వ్యాపారం.. చివరికి పోలీసులకు చిక్కిన యువకుడు
యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఇంట్లోనే ఫ్రూట్ వైన్ తయారు చేసి విక్రయించిన హైదరాబాద్ యువకుడిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. లైసెన్స్ లేకుండా మద్యం తయారు చేసి విక్రయించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన ఆంటోనీ పీటర్ యూట్యూబ్‌లో ఫ్రూట్ వైన్ తయారీ వీడియోలు చూసి ఇంట్లోనే ప్రయోగాలు ప్రారంభించాడు. మొదట స్నేహితులకు రుచి చూపించగా వారి నుంచి మంచి స్పందన రావడంతో దీన్ని వ్యాపారంగా మార్చాలని నిర్ణయించుకున్నాడు.
క్రమంగా ఏడు రకాల ఫ్రూట్ వైన్లను తయారు చేస్తూ సోషల్ మీడియా, పరిచయాల ద్వారా కస్టమర్లను సంపాదించాడు. డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తూ సుమారు ఆరు నుంచి ఏడు నెలల పాటు ఎలాంటి లైసెన్స్ లేకుండానే ఈ వ్యాపారాన్ని నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు, పోలీసులు అతని ఇంటిపై దాడులు నిర్వహించగా రూ.1.50 లక్షల విలువైన 377 లీటర్ల ఫ్రూట్ వైన్, తయారీకి ఉపయోగించిన పరికరాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆంటోనీ పీటర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. లైసెన్స్ లేకుండా మద్యం తయారు చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. అలాగే నాణ్యత పరీక్షలు, భద్రతా ప్రమాణాలు లేకుండా తయారయ్యే మద్యం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరమని హెచ్చరించారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)