"RAW NTR తో మాకు ఎలాంటి సంబంధం లేదు".. ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన

Jul 14, 2026 - 17:08
Updated: 3 months ago
0 4
"RAW NTR తో మాకు ఎలాంటి సంబంధం లేదు".. ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన

జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘RAW NTR’సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టంచేసింది. మంగళవారం (జూలై 14) విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, ఆ సంస్థకు ఎన్టీఆర్ తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదని, ఆయన పేరుతో ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని పేర్కొంది.

ఇటీవల ‘RAW NTR’పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ప్రకటనలు ప్రజల్లో ఎన్టీఆర్‌కు సంబంధం ఉన్నట్టుగా భావన కలిగిస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని కార్యాలయం తెలిపింది. అయితే ఆ సంస్థకు ఎన్టీఆర్, ఆయన కార్యాలయం లేదా అధికారిక బృందంతో ఎలాంటి అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదని స్పష్టం చేసింది.

ఎన్టీఆర్‌కు సంబంధించిన సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు లేదా ఇతర కార్యకలాపాలపై సమాచారం కేవలం ఎన్టీఆర్ స్వయంగా లేదా ఆయన అధికారిక పీఆర్ బృందం ద్వారానే వెల్లడవుతుందని తెలిపింది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థలు చేసే ప్రచారాన్ని అధికారికంగా పరిగణించవద్దని అభిమానులు, మీడియా, సోషల్ మీడియా వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.

అలాగే ఈ అంశంపై ఇదే తమ తుది వివరణ అని పేర్కొంటూ, ఇకపై ఈ విషయంపై వస్తున్న అపోహలు, వదంతులు, ఊహాగానాలకు ముగింపు పలకాలని కోరింది. ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని ఎన్టీఆర్ కార్యాలయం సూచించింది.

రాజకీయ ఎంట్రీ ప్రచారానికి చెక్

గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా జూలై 18న ‘ఊరు-వాడ’పేరుతో ‘RAW NTR’నిర్వహించే కార్యక్రమంలో ఎన్టీఆర్ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయనున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారానికి చెక్ పెడుతూ, అలాంటి కార్యక్రమాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఏ ప్రకటనైనా ఆయన స్వయంగా లేదా అధికారిక బృందం ద్వారానే వెల్లడవుతుందని తెలిపింది.

సినిమాలతో బిజీగా ఎన్టీఆర్

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న‘డ్రాగన్’చిత్రంలో నటిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని 2027 జూన్ 11 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

అదే సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’అనే టైటిల్ ప్రచారంలో ఉండగా, కుమారస్వామి కథాంశంతో సినిమా తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User