అంగన్వాడీల్లో 15,982 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ల జారీకి మార్గదర్శకాలు విడుదల చేసింది.
మొత్తం 33 జిల్లాల్లో 3,100 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 12,882 అంగన్వాడీ సహాయకుల పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ కాగా, మిగిలిన జిల్లాల్లో కూడా త్వరలో ప్రక్రియ ప్రారంభం కానుంది.
మల్టీజోన్-1 పరిధిలోని 20,584 అంగన్వాడీ కేంద్రాల్లో 9,590 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 1,853 టీచర్ పోస్టులు, 7,737 సహాయకుల పోస్టులు ఉన్నాయి. మల్టీజోన్-2 పరిధిలోని 15,197 కేంద్రాల్లో 6,392 ఖాళీలు ఉండగా, అందులో 1,247 టీచర్ పోస్టులు, 5,145 సహాయకుల పోస్టులు ఉన్నాయి.
ఈసారి నియామక ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అంగన్వాడీ టీచర్, సహాయకుల పోస్టులకు ఇంటర్మీడియట్ను కనీస విద్యార్హతగా తప్పనిసరి చేసింది. అలాగే ఎంపిక ప్రక్రియలో తొలిసారిగా ఇంటర్వ్యూ విధానాన్ని ప్రవేశపెట్టింది.
అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత గ్రామం, వార్డు లేదా స్థానిక ప్రాంతానికి చెందిన వారై ఉండాలి. గిరిజన తండాలు, గూడేలు, ఆదివాసీ ఆవాసాల్లోని పోస్టులకు ఆయా ప్రాంతాలకు చెందిన ఎస్టీ మహిళలకే అవకాశం ఉంటుంది. ఎస్సీ వాడల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు.
అంగన్వాడీ టీచర్ పోస్టుల ఎంపికను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ నిర్వహిస్తుంది. అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి మార్కులు కేటాయిస్తారు. సహాయకుల పోస్టులకు కూడా ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి. అయితే ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని సందర్భంలో మాత్రమే పదో తరగతి ఉత్తీర్ణులను పరిగణనలోకి తీసుకుంటారు.
ఎంపిక ప్రక్రియలో ఇంటర్మీడియట్ మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం ప్రత్యేక వెయిటేజీ కల్పించారు. ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు.
పారదర్శకత, ప్రతిభ, సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం రూపొందించిన ఈ కొత్త నియామక విధానం ద్వారా వేలాది మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)