దశాబ్దాల కలకు మళ్లీ ఊపు.. నిజామాబాద్‌కు రూ.2,500 కోట్ల ORR

Jul 27, 2026 - 13:56
0 3
దశాబ్దాల కలకు మళ్లీ ఊపు.. నిజామాబాద్‌కు రూ.2,500 కోట్ల ORR

నిజామాబాద్ నగరవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాజెక్టుకు మళ్లీ కదలిక వచ్చింది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను అధికారులు మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. సుమారు రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, తాజా అంచనాల రూపకల్పనపై రోడ్లు, భవనాల శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.

ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్‌తో పాటు జాతీయ రహదారి-44కు మెరుగైన అనుసంధానం ఏర్పడనుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, బాసర, నిర్మల్ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను నగరంలోకి రాకుండా నేరుగా ORR మీదుగా మళ్లించే అవకాశం ఉండటంతో నిజామాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు రవాణా రంగానికే కాకుండా పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఊతమివ్వనుంది. పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు, ఉత్పత్తుల రవాణా వేగవంతం కావడంతో పాటు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు మరింత సులభంగా తరలించుకునే అవకాశం కలుగుతుంది. దీంతో జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగం పుంజుకునే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో తొలిసారి ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు వివిధ కారణాలతో ముందుకు సాగలేదు. ప్రస్తుతం తాజా అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించే ప్రక్రియ ప్రారంభమవడంతో, ఈసారి అయినా నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కల సాకారం అవుతుందనే ఆశలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User