అజింక్య రహానెకు సచిన్, రోహిత్ భావోద్వేగ వీడ్కోలు..

Jul 31, 2026 - 13:28
0 3
అజింక్య రహానెకు సచిన్, రోహిత్ భావోద్వేగ వీడ్కోలు..

టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానె అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో క్రికెట్ ప్రపంచం భావోద్వేగానికి గురైంది. జెర్సీ నంబర్ 278కి వీడ్కోలు పలుకుతూ రహానె సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయగా, మాజీ, ప్రస్తుత క్రికెటర్లు అతని సేవలను గుర్తు చేసుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఎక్స్ వేదికగా స్పందించిన సచిన్ టెండూల్కర్.. ముంబై జట్టు తరఫున రహానెతో కలిసి ఆడిన రోజులను గుర్తు చేసుకున్నారు. "అవకాశాల కోసం నువ్వు ఎప్పుడూ వెంటపడలేదు. జట్టు కోసం కష్టపడేందుకు సిద్ధంగా ఉండేవాడివి. అందుకే అవకాశాలే నీ దగ్గరకు వచ్చాయి. అదే లక్షణం ఆస్ట్రేలియాలో నీకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించింది. సంయమనం, దూకుడు రెండూ కలిసి నడవగలవని నువ్వు నిరూపించావు" అంటూ రహానెను ప్రశంసించారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రహానెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలు కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నామని, ప్రతి విజయానికి వెనుక రహానె ఎంత కష్టపడ్డాడో తనకు తెలుసని పేర్కొన్నారు. అతని కమిట్‌మెంట్, ప్రొఫెషనలిజం ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలుస్తాయని కొనియాడుతూ.. జీవితంలోని కొత్త అధ్యాయానికి శుభాకాంక్షలు తెలిపారు.

రహానె కెరీర్‌ను పరిశీలిస్తే.. భారత్ తరపున 85 టెస్టుల్లో 5,077 పరుగులు చేసి 12 సెంచరీలు, 26 అర్ధశతకాలు నమోదు చేశాడు. వన్డేల్లో 90 మ్యాచ్‌ల్లో 2,962 పరుగులు సాధించగా, మూడు సెంచరీలు, 24 అర్ధశతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 20 మ్యాచ్‌లు ఆడి 375 పరుగులు చేశాడు.

కెప్టెన్‌గా కూడా రహానె తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మెల్‌బోర్న్ టెస్టు తర్వాత జట్టును అద్భుతంగా నడిపించి, గబ్బా వేదికగా ఆస్ట్రేలియాపై చారిత్రక విజయాన్ని అందించి సిరీస్‌ను భారత్ ఖాతాలో వేసిన ఘనత అతని నాయకత్వానిదే. అలాగే 2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాపై భారత్ సాధించిన కీలక టెస్టు విజయానికి కూడా రహానె కెప్టెన్‌గా నిలిచాడు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User