ఆరు తరాలు.. 83 మంది సభ్యులు.. అనంతపురం జంబో జాయింట్ ఫ్యామిలీకి దేశమంతా ఫిదా
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా కనుమరుగవుతున్నఈ రోజుల్లో.. అనంతపురం జిల్లాలోని ఓ కుటుంబం మాత్రం "కలిసి ఉంటే కలదు సుఖం" అనే సామెతను అక్షరాలా నిజం చేస్తోంది. కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన హనుమంతరాయుడు, ముత్యాలప్ప కుటుంబం ఆరు తరాలుగా విడిపోకుండా ఒకే కుటుంబంగా జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ కుటుంబంలో ఏకంగా 83 మంది సభ్యులు కలిసి జీవించడం విశేషం.
రెండు కుటుంబాలతో ప్రారంభమైన ఈ వంశం నేడు ఆరు తరాలకు విస్తరించింది. ప్రస్తుతం నాలుగు ఇళ్లలో నివసిస్తున్నప్పటికీ, కుటుంబం మాత్రం ఒక్కటిగానే కొనసాగుతోంది. కుటుంబ సభ్యులందరూ ఒకే వంటింట్లో తయారైన భోజనమే తింటారు. ఆస్తుల కంటే అనుబంధాలకే ఎక్కువ విలువ ఇస్తూ తరతరాలుగా ఐకమత్యాన్ని కాపాడుకుంటున్నారు.
ఈ కుటుంబంలో 43 మంది ఓటర్లు ఉండగా, 20 మంది కుమారులు, 20 మందికి పైగా కోడళ్లు కలిసి జీవిస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని కుటుంబ సభ్యులే పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవడం తమ సంప్రదాయమని వారు చెబుతున్నారు. కుటుంబ పెద్దల వద్దకు సమస్యలు వెళ్లే పరిస్థితి రాదని పేర్కొంటున్నారు.
వ్యవసాయమే ఈ కుటుంబానికి ప్రధాన జీవనాధారం. సుమారు 120 ఎకరాల్లో వేరుశెనగ, టమాటా, వంకాయ, కర్బూజ, బొప్పాయి, మిరప, వరితో పాటు పలు పంటలను సాగు చేస్తున్నారు. వ్యవసాయ పనులన్నీ కుటుంబ సభ్యులే కలిసి నిర్వహించడం ఈ కుటుంబ ప్రత్యేకత.
వ్యవసాయంతో పాటు ఐదు ట్రావెల్స్ బస్సులు, వెయ్యి గొర్రెలు, 70 గేదెలు, మూడు ట్రాక్టర్లు, బొలెరో, ఐచర్ వాహనాలను కూడా సమిష్టిగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం కుటుంబ పెద్దలు ఎవరు ఏ పని చేయాలనేది నిర్ణయిస్తారు. అందరూ వారి సూచనల మేరకే పనులు చేపడతారు.
ఆహార విషయంలోనూ సంప్రదాయానికే పెద్దపీట వేస్తున్నారు. ప్రతిరోజూ కట్టెల పొయ్యిపైనే రాగి సంగటి, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు వండుతుంటారు. పండుగల సమయంలో కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరితే ఒక పొట్టేలు, 15 కిలోల చికెన్ సాధారణమేనని, అందరూ హాజరైతే మూడు పొట్టేళ్లు, 40 కిలోల చికెన్ అవసరమవుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తూ, ప్రభుత్వ హాస్టళ్లలో ఉంచి విద్యాభ్యాసం చేయిస్తున్నారు. సంపదలు శాశ్వతం కావని, బంధాలు మరియు ఐకమత్యమే కుటుంబానికి అసలైన బలమని నమ్ముతూ జీవిస్తున్న ఈ కుటుంబం నేటి సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)