ఫిఫా సంచలన నిర్ణయం.. వరల్డ్ కప్ ఫైనల్ పిచ్‌ను ముక్కలుగా అమ్మకం!

Jul 11, 2026 - 13:12
0 2
ఫిఫా సంచలన నిర్ణయం.. వరల్డ్ కప్ ఫైనల్ పిచ్‌ను ముక్కలుగా అమ్మకం!

ఫిఫా ప్రపంచ కప్ 2026 తుది దశకు చేరుకుంది. జులై 19న అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని మెట్‌లైఫ్ స్టేడియం వేదికగా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఫైనల్‌కు ముందే ఫిఫా తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే ఫైనల్ టికెట్ల భారీ ధరలపై విమర్శలు ఎదుర్కొంటున్న ఫిఫా.. ఇప్పుడు మ్యాచ్ ముగిసిన తర్వాత ఫైనల్‌లో ఉపయోగించిన పిచ్‌ను ముక్కలుగా కట్ చేసి అభిమానులకు విక్రయించనున్నట్లు ప్రకటించింది.

ఒక్కో పిచ్ ముక్క ధర రూ.38 వేలకు పైగా 

ఫిఫా ప్రకటించిన వివరాల ప్రకారం, ప్రపంచ కప్ ఫైనల్‌లో ఉపయోగించే మైదానంలోని గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా విభజించి ప్రత్యేక జ్ఞాపికగా విక్రయించనుంది. ఒక్కో పిచ్ ముక్క ధర 450 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.38 వేలు) గా నిర్ణయించింది.

ప్రతి పిచ్ ముక్కను ప్రత్యేకంగా భద్రపరచి, అక్రిలిక్ కేస్‌తో కూడిన ప్రీమియం డిస్‌ప్లే బాక్స్‌లో అందించనున్నట్లు ఫిఫా తెలిపింది. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్మరణీయమైన క్షణానికి గుర్తుగా ఈ ప్రత్యేక జ్ఞాపికను రూపొందిస్తున్నామని పేర్కొంది.

పరిమాణంపై స్పష్టత లేదు

పిచ్ ముక్క పరిమాణాన్ని 17.5 × 17.5 × 17.5 గా మాత్రమే వెల్లడించిన ఫిఫా.. అది అంగుళాల్లోనా, సెంటీమీటర్లలోనా లేదా మిల్లీమీటర్లలోనా అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.

ఈ ప్రత్యేక జ్ఞాపికలను ప్రస్తుతం అమెరికా, యూరప్‌లోని అభిమానులకు మాత్రమే అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. ప్రపంచ కప్ ఫైనల్ ముగిసిన తర్వాతే ఆర్డర్ల డెలివరీ ప్రారంభమవుతుందని తెలిపింది.

టికెట్ ధరలపైనా విమర్శలు

ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ టికెట్ల ధరలు కూడా భారీగా ఉండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

* సాధారణ టికెట్ గరిష్ఠ ధర 32,970 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.28 లక్షలు).
* ఫుడ్, డ్రింక్స్‌తో కూడిన హాస్పిటాలిటీ ప్యాకేజీల ధరలు 34,500 డాలర్లు, 32,500 డాలర్లుగా నిర్ణయించారు.

ఈ ధరలు సాధారణ అభిమానులకు అందని ద్రాక్షగా మారాయని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మైదాన నాణ్యతపైనా సందేహాలు

మెట్‌లైఫ్ స్టేడియంలో సాధారణంగా ఎన్‌ఎఫ్‌ఎల్ జట్లు న్యూయార్క్ జెయింట్స్ ,న్యూయార్క్ జెట్స్ మ్యాచ్‌ల కోసం కృత్రిమ గడ్డిని ఉపయోగిస్తారు. అయితే ప్రపంచ కప్ కోసం ప్రత్యేకంగా సహజ గడ్డితో మైదానాన్ని సిద్ధం చేశారు.

అయినప్పటికీ, టోర్నీ సందర్భంగా మైదానం నాణ్యతపై పలువురు ఆటగాళ్లు, కోచ్‌లు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే మైదానంలోని పిచ్‌ను జ్ఞాపికగా విక్రయించాలన్న ఫిఫా నిర్ణయం అభిమానుల్లో ఆసక్తితో పాటు విమర్శలకు కూడా కారణమవుతోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User