సాక్షాత్కార వైభవోత్సవాలకు సిద్ధమైన శ్రీనివాసమంగాపురం ఆలయం

Jul 16, 2026 - 15:43
Updated: 3 months ago
0 3
సాక్షాత్కార వైభవోత్సవాలకు సిద్ధమైన శ్రీనివాసమంగాపురం ఆలయం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం సాక్షాత్కార వైభవోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జూలై 17 నుంచి 19 వరకు నిర్వహించనున్న ఉత్సవాలకు ముందు గురువారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు.

తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను పవిత్ర జలాలతో శుద్ధి చేశారు.

అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షించి ఆధ్యాత్మిక శోభను మరింత పెంచారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి భక్తులకు దర్శనాన్ని పునఃప్రారంభించారు.

సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ప్రత్యేక వాహన సేవలు నిర్వహించనున్నారు. జూలై 17న పెద్దశేష వాహనం, జూలై 18న హనుమంత వాహనం, జూలై 19న గరుడ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా తిరుపతికి చెందిన భక్తుడు శ్రీ నరసింహులు స్వామివారికి పరదాలను విరాళంగా సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపీనాథ్, ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User