ఆసియా అండర్-23 అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.. సత్తా చాటిన తెలంగాణ యువ అథ్లెట్ ప్రవళిక
చైనాలో జరుగుతున్న ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణకు చెందిన యువ అథ్లెట్ నారిమళ్ల ప్రవళిక అద్భుత ప్రతిభ కనబరిచింది. భారత మహిళల 4×400 మీటర్ల రిలే జట్టులో సభ్యురాలిగా బరిలోకి దిగిన ప్రవళిక దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది.
చైనాలోని ఒర్డొస్‌లో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో ప్రవళికతో పాటు శ్రావణి, నోఫిసా, సాండ్రా మొల్ సబూ సభ్యులుగా ఉన్న భారత రిలే జట్టు 3:33.62 నిమిషాల్లో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆతిథ్య దేశం చైనా రజత పతకాన్ని, కజకిస్థాన్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాయి.
ఈ టోర్నీలో భారత్‌కు లభించిన తొలి స్వర్ణ పతకం ఇదే కావడం విశేషం. తెలంగాణకు చెందిన ప్రవళిక విజయంతో రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా డిండి మండలానికి చెందిన నారిమళ్ల ప్రవళిక ప్రస్తుతం చర్లపల్లి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. అంతర్జాతీయ వేదికపై ఆమె సాధించిన ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)