తెలంగాణలో ఈ-కేబినెట్‌కు గ్రీన్ సిగ్నల్.. డిజిటల్ పాలన దిశగా రేవంత్ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనను మరింత ఆధునికీకరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ సమావేశాలను ఇకపై పూర్తిస్థాయిలో ఎలక్ట్రానిక్ విధానంలో నిర్వహించేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ-కేబినెట్ వ్యవస్థ అమలుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.
పేపర్‌లెస్ పరిపాలన లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలను డిజిటలైజ్ చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సచివాలయం, డైరెక్టరేట్లు, కమిషనరేట్ కార్యాలయాల్లో డిజిటల్ విధానాల అమలుపై దృష్టి సారించిన ప్రభుత్వం, ఇప్పుడు మంత్రివర్గ సమావేశాలను కూడా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.ఈ విధానం అమల్లోకి వస్తే కేబినెట్ సమావేశాల్లో కాగితపు ఫైళ్లు, ముద్రిత పత్రాల వినియోగం పూర్తిగా తగ్గనుంది. వాటి స్థానంలో మంత్రులందరికీ ప్రత్యేక భద్రతా వ్యవస్థలతో కూడిన ఆధునిక ట్యాబ్‌లను అందించనున్నారు. కేబినెట్ అజెండా, శాఖల ప్రతిపాదనలు, నిర్ణయాలకు సంబంధించిన పత్రాలు అన్నీ డిజిటల్ రూపంలోనే అందుబాటులో ఉండనున్నాయి.

ఈ-కేబినెట్ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) రూపొందించిన సురక్షిత సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నట్లు సమాచారం. దీని ద్వారా సమావేశాలకు సంబంధించిన సమాచారం అత్యంత గోప్యంగా ఉండటంతో పాటు, కీలక నిర్ణయాలు వెంటనే డిజిటల్ రికార్డుల్లో నమోదయ్యే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఈ విధానం వల్ల కాగితాల వినియోగం గణనీయంగా తగ్గి పర్యావరణ పరిరక్షణకు దోహదపడనుంది. అలాగే ప్రభుత్వ వ్యయం తగ్గడంతో పాటు నిర్ణయాల అమలు, పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా మారనుంది. ముఖ్యంగా కేబినెట్ చర్చలకు సంబంధించిన సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ-కేబినెట్ ఏర్పాట్లపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్యాబ్‌ల పనితీరు, సాఫ్ట్వేర్ భద్రత, నెట్వర్క్ కనెక్టివిటీ, డేటా రక్షణ వంటి అంశాలపై ఆయన అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలిసింది.
దేశంలో హిమాచల్ ప్రదేశ్ తొలిసారిగా పేపర్‌లెస్ కేబినెట్ విధానాన్ని అమలు చేయగా, అనంతరం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని స్వీకరించాయి. ఇప్పుడు తెలంగాణ కూడా అదే బాటలో అడుగులు వేస్తుండటంతో రాష్ట్ర పరిపాలనలో డిజిటల్ యుగానికి నాంది పలికినట్టుగా భావిస్తున్నారు.
త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశాన్ని ప్రయోగాత్మకంగా లేదా పూర్తిస్థాయిలో ఈ-కేబినెట్ విధానంలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)