అనంతపురంలో మళ్లీ బంగారం పంట.. రామగిరి గనులకు పునర్జీవం
శ్రీసత్యసాయి జిల్లాలోని చారిత్రాత్మక రామగిరి బంగారు గనులు మళ్లీ తెరుచుకునే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. తాజాగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) నిర్వహించిన సర్వేలో గనుల ప్రాంతంలోని మట్టిలో టన్నుకు సగటున 3.6 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించింది. దీంతో ప్రభుత్వం త్వరలోనే మైనింగ్ లీజుల కోసం టెండర్లు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రామగిరి గనులకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. 1973లో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్‌కు 461 ఎకరాలను లీజుకు ఇవ్వగా, 2001 వరకు ఇక్కడ బంగారం తవ్వకాలు కొనసాగాయి. అయితే ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడంతో గనులను మూసివేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది.
తాజా సర్వేతో రామగిరి గనులపై మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లా జొన్నగిరిలో టన్ను మట్టికి సుమారు 1 గ్రాము బంగారం లభిస్తుండగా, రామగిరిలో దాని కంటే మూడు రెట్లకు పైగా నిల్వలు ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది.
రామగిరి గనులు పునరుద్ధరితమైతే శ్రీసత్యసాయి జిల్లాలో వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ గనుల పునరుద్ధరణ కోసం గత 15 ఏళ్లుగా కృషి చేస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)